Exit Polls: ‘గెలుపు మీద అనుమానమేమీ లేదు.. మెజార్టీ గురించిన ఆలోచన తప్ప. రికార్డు స్థాయి మెజార్టీ సాధిస్తాం.. దేశమంతా తిరుపతి ఉప ఎన్నిక ఫలితం గురించి మాట్లాడుకునేలా చేస్తాం..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుపతి ఉప ఎన్నిక గురించి గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. సిట్టింగ్ లోక్ సభ స్థానాన్ని నిలబెట్టుకోవడం వైసీపీకి పెద్ద కష్టమేమీ కాదని, ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ‘ఆఫ్ ది రికార్డ్’గా మాట్లాడుకున్నారు. అయితే, ఎక్కడో వైసీపీకి కొంత అనుమానం కలిగింది.
ఆ అనుమానం నేపథ్యంలో, కొంచెం అగ్రెసివ్ అయ్యారు వైసీపీ నేతలు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూర్తిగా తిరుపతిలో మోహరించారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్ళకపోవడం ఒక్కదాన్నీ మినహాయిస్తే, మొత్తం అధికారాన్ని తిరుపతి మీద కేంద్రీకరించి, అధికార పార్టీ రాజకీయం నడిపిందన్నది నిర్వివాదాంశం. ఇక, తాజా ఎగ్జిట్ పోల్ అంచనాల్లో వైసీపీకి 60 శాతం ఓట్లు దక్కే అవకాశం వుందని తేలింది. అదే నిజమైతే, బంపర్ మెజార్టీ వైసీపీ పరం అయినట్లే భావించాలి. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం విదితమే. వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి బరిలో నిలిచారు. వైఎస్ జగన్ గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో, జగన్ వెన్నంటే వుండి, ఆయనకి ఫిజియోథెరపీ సేవలందించారు గురుమూర్తి. ఇక, టీడీపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ పోటీ చేయగా, జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ బరిలో నిలిచారు.
బీజేపీ, తిరుపతిలో పెద్దగా సాధించిందేమీ లేనట్టే కనిపిస్తోంది. టీడీపీ కనాకష్టంగా డిపాజిట్ దక్కించుకునే అవకాశం వుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. అయితే, ఫేక్ ఓటర్ల ద్వారా ఫేక్ ఓట్లు వేయించి వైసీపీ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందనే విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. వైసీపీకి ఓట్లెయ్యడానికి తిరుపతి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున ఫేక్ ఓటర్లను వైసీపీ నేతలు తరలించారనే విమర్శలున్నాయి.