ఆయన ఓ మాజీ ఎంపి. కిందటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పత్తా లేకుండా పోయారు. కనీసం మాట్లాడించేందుకు వచ్చిన సహచరులకు కూడా మొహం చాటేశారు. స్వపక్షం విపక్షం అన్న తేడా లేకుండా అందరికి దూరంగా ఉన్నారు. ఇలా 18 నెలల అజ్ణాతవాసం తర్వాత ఇప్పుడు ఆయన్నే అందర్ని మాట్లాడిస్తున్నారు. జనంలోకి వచ్చి అందర్ని కలుస్తున్నారు. ఆయనే ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ నగేష్.
ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు చిరాకేసిందట… ఛీ ఇంకా ప్రజాజీవితంలో ఉండడం వేస్ట్ అనుకున్నారట. ఓ రకంగా వైరాగ్యం వచ్చేసిందట. కాని అది కూడా నాలుగు రోజుల ముచ్చటే కావడంతో… అలవాటైన ప్రాణం కదా మళ్లీ జనంలోకి వచ్చేశారంట మాజీ ఎంపి నగేష్.
ఈయన ఇప్పుడు మౌనం వీడి జిల్లా అంతా తిరిసేస్తున్నారు. అభివృద్ది పనుల కోసం అధికారులను తెగ కలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారి పనులు అసంపూర్తిగా వదిలేశారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీసర్లను కలిసి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మొహం చాటెయ్యడంతో ఈయన పని ఇక అయిపోయిందని ప్రత్యర్థులు తెగ ప్రచారం చేశారు. వాటికి చెక్ పెట్టేందుకు మరింత యాక్టివ్ అయ్యారు మాజీ ఎంపి నగేష్. బోథ్ నియోజకవర్గంలో ఇప్పటికీ, ఎప్పటికీ తనదే హవా అని కలిసిన వారందరికి చెప్తు కుంటున్నారంట. ఎన్నికల్లో ఓడిపోవడంతో మరో మూడేళ్లు ఖాళీగా ఉండేకన్నా కేసీఆర్ ని ప్రసన్నం చేసుకొని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ పదవి మీద కన్నేసిన ఈయన… దాన్ని సాధించుకునేందుకు ఇలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారని టాక్.
ఈయన గారి యాక్టివ్ రోల్ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు చిరాకు తెప్పిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను సంప్రదించకుండా నేరుగా మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి నియోజకవర్గ సమస్యలు ఎలా తీసుకెళ్తారని మండిపడున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఎమ్మెల్యేని సైడ్ చేయడం తగదని మండిపడుతున్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నానని చెబుతున్నారు. మొత్తానికి గతంలో మంత్రిగా, ఎంపీగా పనిచేసిన నగేష్ తాజా ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో కాలమే చెబుతుంది.