మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ -జగన్ సర్కార్ మధ్య నలుగుతోన్న వివాదంపై ఎవరి వాదనలు వాళ్లవి. ఈ అంశంపై సర్కార్ సుప్రీంలో సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేయడానికి సిద్దమవుతోంది. అయితే తాజగా ఈ వ్యవహారంలోకి మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి దూరారు. అలాగే జగన్ తీరుపైనే జేసీ ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం తప్పేంలేదన్నారు. కానీ ఆయన్ని ఎన్నికల కమీషనర్ గా కొనసాగించకపోవడం అన్నది పెద్ద తప్పుగా చెప్పుకొచ్చారు. జగన్ పాలనపై చదువుకున్న వారందరికీ ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చిందన్నారు.
మరికొన్ని రోజుల్లో మిగతా వారికి వస్తుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. కొర్టు ఎన్నిసార్లు చెప్పినా మా వాడు వినడం లేదు. నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రధాని మాట తప్ప ఇంకెవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. ఆయనొక నియంతలా ఫీలవుతున్నారు. ఈ విధానం మంచిది కాదు. పద్దతి మార్చుకుని పాలించాలి. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని చురకలు అంటించారు. అలాగే జగన్ ఏడాది పాలనపైనా జేసీ మండిపడ్డారు. మావాడికి 100 కి 100 కాదు. 110 మార్కులు వేస్తానని ఎద్దేవా చేసారు. రాజకీయాలలో నాటికి-నేటికి చాలా మార్పులొచ్చాయన్నారు.
గతంలో బస్సులు జాతీయం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి న్యాయ స్థానం సలహా ఇచ్చిన వెంటనే రాజీనామా చేసారు. కానీ జగన్ గత రాజకీయాలను…వాళ్ల అనుభవాలను పట్టించుకోకుండా తనకేం తొస్తే అది చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.అధికారం చేతిలో ఉందని అహం చూపించకూడదని, ప్రతీ విషయంలో ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. అదే రాజకీయం అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసారు. అలాగే రాజధాని అమరావతి కోసం దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడుతున్నట్లు పట్టించుకోలేదని మరోసారి ఆక్షేపించారు.