Ex Minister Narayana : మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ మీద మరో కేసు నమోదైంది. మొత్తంగా రెండు కేసులు ఆయన మీద నమోదు కాగా, ఓ కేసులో ఆయన్ని అరెస్టు చేసి, హైద్రాబాద్ నుంచి చిత్తూరుకి తరలించారు. ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ అరెస్టయినట్లు తొలుత వార్తలొచ్చాయి. అంతలోనే, అమరావతి ల్యాండ్ స్కామ్‌లో ఆయన్ని అరెస్టు చేసినట్లుగా ప్రభుత్వం నుంచి ఇంకో అంశం వెలుగు చూసింది.
చంద్రబాబు హయాంలో నారాయణ, మునిసిపల్ శాఖ మంత్రిగా పని చేశారు. అమరావతి వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నారు. అప్పట్లో భూ సమీకరణ విషయమై చాలా ఆరోపణలు వచ్చాయి చంద్రబాబు ప్రభుత్వం మీద. గతంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి కేసులు నమోదయ్యాయి.
తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరుని ఏ1గా పోలీసులు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏ2గా నారాయణ వున్నారు.
అయితే, నారాయణ అరెస్టు అక్రమం అని టీడీపీ చెబుతుండగా, అది సక్రమమేనని వైసీపీ చెబుతోంది. నారాయణ విద్యాసంస్థల్లో అక్రమాలు జరిగినప్పుడు నారాయణని అరెస్టు చేశారు సరే.. ప్రభుత్వ స్కూళ్ళలో అక్రమాలు జరిగాయి గనుక సంబంధిత శాఖ మంత్రిని అరెస్టు చేస్తారా.? ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా.? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.
ప్రభుత్వ స్కూళ్ళలో అక్రమాల నేపథ్యంలో టీచర్లను అరెస్టు చేశాం.. ప్రభుత్వ స్కూళ్ళు, మంత్రికి సంబంధించినవి కావు కదా.? అంటూ వింత వాదనను తెరపైకి తెచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. మరి, అమరావతి కుంభకోణంలో అప్పటి మంత్రి మీద కేసు ఎలా నమోదు చేసినట్టు.? అన్నది టీడీపీ ప్రశ్న.