ఎమ్మెల్యే అయ్యింది మొదలు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారామె. మంత్రి అయ్యాక మరింత వివాదాల్లో కూరుకుపోయారు. మంత్రి పదవి పోయాక, ఎమ్మెల్యే పదవి పోయాక కూడా ఆమె తీరు మారలేదు. హత్యకు కుట్ర పన్నారన్న కేసు కూడా ఆమెపై వుంది. తల్లిదండ్రులేమో ఫ్యాక్షన్ ప్రభావ ప్రాంతం నుంచి చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించినా, గొడవలకు దూరంగా వుండే ప్రయత్నం చేశారు. వారి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న కుమార్తె మాత్రం, తల్లిదండ్రులకు చెడ్డపేరు తెస్తున్నారు. మరణం తర్వాత ఆ తల్లిదండ్రులకు కుమార్తె ద్వారా అవమానాలే ఎదురవుతున్నాయి. ఆమె ఎవరో కాదు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.
ఓ భూ వివాదంలో కిడ్నాప్ ఘటనకు సంబంధించి అఖిల ప్రియ ఏ1 నిందితురాలిగా మారారు. తొలుత ఆమె పేరుని ఏ2గా పెట్టిన పోలీసులు, ఆ తర్వాత ఆమెకు నిందితుల లిస్టులో ప్రమోషన్ ఇవ్వడం గమనార్హం. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల అరెస్ట్ సందర్భంగా నానా యాగీ చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, భూమా అఖిలప్రియ అరెస్ట్ వ్యవహారంలో పెదవి విప్పలేదు. అలాంటి పరిస్థితిని కల్పించారు భూమా అఖిలప్రియ తన చర్యల ద్వారా. అచ్చెన్నాయుడిపై అవినీతి ఆరోపణలు, కొల్లు రవీంద్రపై హత్య కేసు నమోదయినా.. వారిపై మరీ అంత వ్యతిరేకత కనిపించలేదు. కానీ, ఇక్కడ.. అఖిలప్రియ విషయంలో పరిస్థితి ఇంకోలా వుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఆ సింపతీ కూడా చూపించడంలేదెవరూ.
గత కొంత కాలంగా రాజకీయాల్ని అడ్డంపెట్టుకుని ఆమె, ఆమె భర్త భార్గవ్ రామ్ చేస్తున్న పనులే. కిడ్నాప్ ఎలా జరిగిందీ, ఎలా బాధితుల్ని వెంటాడిందీ.. పోలీసులు పూసగుచ్చినట్లుగా వివరించేసరికి, ఈ కేసు నుంచి అఖిలప్రియ అంత తేలిగ్గా బయటపడే అవకాశమే లేదని అందరికీ అర్థమయిపోయింది. ఇంతలా దిగజారిపోయాక, భూమా కుటుంబం కర్నూలు జిల్లా ప్రజానీకానికి మొహం చూపించుకునే పరిస్థితి వుంటుందా.? అని భూమా అభిమానులు వాపోతున్నారు. రాజకీయాలకతీతంగా భూమా నాగిరెడ్డి, ఆయన భార్య శోభా నాగిరెడ్డి పేరు తెచ్చుకుంటే, వారి కుమార్తె మాత్రం రాజకీయాలకే కళంకం తెచ్చారన్న చర్చ అంతటా జరుగుతోంది.