ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద కారవాన్ లో బస చేసిన చంద్రబాబు.. బస్సు నుంచి బయటకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది.
అవును… ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును అవినీతి, అక్రమాల కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు! చంద్రబాబు అరెస్టు సమయంలో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే… శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు బస చేస్తున్న ప్రాంతానికి ఏపీ పోలీసులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులను తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. అదే సమయంలో చంద్రబాబు తరపు లాయర్లు కూడా అక్కడకు చేరకున్నారు. దీంతో లాయర్లకు, పోలీసులకు మద్య తీవ్ర చర్చ నడించిందని తెలుస్తుంది!
ఈ విషయంలో చంద్రబాబు లాయర్లకు సమాధానం చెప్పిన పోలీసు అధికారులు… హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆధారాలు చూపించాలని న్యాయవాదులు డిమాండ్ చేయగా.. రిమాండు రిపోర్టులో అన్నీ స్పష్టంగా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో లాయర్లు సైడ్ అవ్వక్క తప్పలేదని తెలుస్తుంది.
అయితే లాయర్లు తప్పుకున్నా… చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ నాయకుల మాత్రం తీవ్రంగా ప్రతిఘటించారు! దీంతో చంద్రబాబుతోపాటు వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కాలువ శ్రీనవాసులు, భూమా అఖిల ప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ కేసులో చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 409, 418, 420, 465, 468, 471, 201, ఆర్/డబ్ల్యూ 109, 34, 37 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇది నాన్ బెయిలబుల్ కేసని.. కేవలం కోర్టు ద్వారా మాత్రమే బెయిల్ తెచ్చుకునే వీలుంటుందని తెలుస్తుంది. ఈ రోజు రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో చంద్రబాబుకు బెయిల్ సోమవారం దొరుకుతుందేమో అనే చర్చ మొదలైంది.
కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా ఉన్నారు. ఆయన కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. స్కిల్ డెవపల్‌మెంట్ లో రూ.371 కోట్ల స్కాం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో చంద్రబాబు ఏ1, అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు. దీంతో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేశారు.