తెలుగు దేశం పార్టీ లో భూమా కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వారి వారసురాలిగా భూమా అఖిల ప్రియ పార్టీ లో కీలక నేతగా ఎదిగారు. కానీ తాజాగా ఆమెపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జల జీవన్ మిషన్ సమావేశానికి ఆమె గైర్హాజరవడం, కానీ ఆమె స్థానంలో ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి హాజరుకావడం వివాదానికి కారణమైంది.
ఈ సమావేశానికి ఇద్దరు రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు హాజరవ్వగా, అఖిల ప్రియ లేకపోవడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, ఆమె స్థానంలో విఖ్యాత్ రెడ్డి వేదికపై ప్రత్యేకంగా కుర్చీ వేసుకుని అధికారులతో చర్చించడం మరింత గందరగోళానికి దారి తీసింది. అధికారిక హోదా లేకుండా ఓ ప్రజాప్రతినిధి మాదిరిగా వ్యవహరించడం మంత్రులకు నచ్చకపోగా, ఈ వ్యవహారం పై మంత్రులు ఎన్ఎండీ ఫరూఖ్, బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అఖిల ప్రియ నిర్ణయాలు పార్టీ పెద్దలకు ఊహించని చిక్కులు తెచ్చిపెడుతున్నాయా లేదా ఆమె ప్రత్యర్థులు ఈ వ్యవహారాన్ని పెంచిపుచ్చుతున్నారా అనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. ఇప్పటివరకు ఈ వివాదంపై అఖిల ప్రియ ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం మరో ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా ఈ సంఘటనపై ఇద్దరు మంత్రులు ఏకంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం, దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకం.
టీడీపీ అధినాయకత్వం భూమా కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చినా, పార్టీకి ఇబ్బందిగా మారే పరిణామాలు చోటుచేసుకుంటే ఉపేక్షించదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూమా కుటుంబం రాజకీయంగా బలంగా ఉన్నా, ఇటువంటి సంఘటనలు అనవసర ఒత్తిడిని తీసుకువస్తాయన్న భావన పార్టీలో ఉన్నవారిలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి, అఖిల ప్రియ దీనిపై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.