Bhuma Akhila Priya: తాజాగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. స్పృహ తప్పికింద పడిపోయారు. అసలేం జరిగింది? ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది అన్న వివరాల్లోకి వెళితే.. అఖిల ప్రియ దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెలో జరిగిన మూల పెద్దమ్మ దేవరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గరుడ దీపాన్ని మోశారు అఖిల. గరుడ దీపం మోసిన తర్వాత ఆమె కొంచెం అస్వస్థతకు గురయ్యారు. బీపీ కారణంగా స్పృహ తప్పిపడిపోయారు. దాంతో ఆమెను వెంటనే అంబులెన్స్ లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. భూమా అఖిల ప్రియ అస్వస్థతకు గురయ్యారని తెలియటంతో టీడీపీ శ్రేణులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు గోవిందిన్నె మూల పెద్దమ్మ దేవరకు జిల్లాలో ఎంతో విశిష్టత ఉంది. 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు దేవర జరుగుతోంది. ఆదివారం నుంచి దేవర మొదలైంది. మొత్తం మూడు రోజుల పాటు దేవర జరగనుంది. అయితే తాజాగా 8వ తేదీ దేవీ ఉత్సవం జరిగింది. ఈ రోజు గండదీప పూజలు కూడా జరిగాయి. 10వ తేదీన అంటే మంగళవారం ఎల్లమ్మ పూజలు జరుగనున్నాయి.
ఎల్లమ్మ పూజలతో దేవర ముగుస్తుంది. దేవర నేపథ్యంలోనే గోవిందిన్నే జన సంద్రంగా మారింది. బంధుమిత్రులతో గ్రామంలోని ఇళ్లు కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇలా జరగడంతో గ్రామస్తులు కాస్త ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతం భూమా అఖిల ప్రియ పరిస్థితి మెరుగుపడినట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం గురించి ఇంకా మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి తాను అస్వస్థకు గురవడం పట్ల భూమా అఖిలప్రియ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.