హుజూరాబాద్‌లో గెలిచేది తానేనంటున్న ఈటెల.! అంత ధైర్యమేంటట.?

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేదెవరు.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రేసులో ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అధికార టీఆర్ఎస్, తన స్థానాన్ని తానే నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. పట్టుదలతో వున్నారు. గత ఎన్నికల్లో గులాబీ జెండా పట్టుకుని గెలిచిన ఈటెల రాజేందర్ చేతిలో ఈసారి కాషాయ జెండా వుంది. దుబ్బాక తరహాలోనే తెలంగాణ రాష్ట్ర సమితికి హుజూరాబాద్ నియోజకవర్గంలో షాకివ్వాలన్నది బీజేపీ ఆలోచన. బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకూడదని గులాబీ పార్టీ భావించడంలో వింతేముంది.? ఈ క్రమంలోనే దళిత బంధు పథకం తెరపైకి తెచ్చింది గులాబీ ప్రభుత్వం. కానీ, అదెంతవరకు సత్ఫలితాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి అందిస్తుందో చెప్పలేం. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభ్యర్థి ఖరారవడంపై ఈటెల రాజేందర్ స్పందించారు.

గులాబీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, తన గెలుపుని ఆపలేదని ఈటెల తేల్చి చెప్పారు. తనను గెలిపించుకోవాల్సిన బాధ్యతను హుజూరాబాద్ ప్రజలే స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్నారన్నది ఈటెల రాజేందర్ వాదన. మరోపక్క, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎందుకు చేశారంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు. ఇది నిజంగానే పెద్ద కామెడీ. ఈటెల రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసిందే గులాబీ పార్టీ. నైతికతకు కట్టుబడి ఈటెల రాజీనామా చేయడం ఈటెలకు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణలోనూ సింపతీ వేవ్‌ని క్రియేట్ చేసింది. ఇదిలా వుంటే, హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం కోసం జాతీయ స్థాయి నాయకులు రాబోతున్నారని ఈటెల సన్నిహితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే గనుక జరిగితే, ఈటెలకు అడ్వాంటేజ్ అవుతుంది. అలాగని గులాబీ పార్టీని తక్కువ అంచనా వెయ్యలేం. ఇంతకీ, కాంగ్రెస్ పార్టీ సంగతేంటి.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.