హుజూరాబాద్ డౌటేనంటున్న గులాబీ దళం.?

Etela To Win Huzurabad Again?

Etela To Win Huzurabad Again?

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మరోమారు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించబోతున్నారా.? అంటే, ప్రస్తుతం వున్న సమీకరణాల్ని బట్టి ‘ఔను’ అనే చెప్పక తప్పదేమో. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓడింది. నిజానికి అది గులాబీ పార్టీకి సిట్టింగ్ స్థానం. పైగా, సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నిక. అయినాగానీ, అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఓడింది. నాగార్జున సాగర్ విషయానికొస్తే, ఇదీ దుబ్బాక లాంటి వ్యవహారమే.

కానీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచి, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది టీఆర్ఎస్. హుజూరాబాద్ నియోజకవర్గం పరిస్థితి కాస్త భిన్నం.. అధికార పార్టీకి పూర్తిగా సంక్లిష్టం. సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మాజీ నేత. పైగా, మాజీ మంత్రి. కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ మీద వేటు వేశారు.. మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఓ బీసీ నాయకుడ్ని ఇంత దారుణంగా తొలగిస్తారా.? అన్న విమర్శలు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీదకు దూసుకొచ్చాయి.

ఆ బీసీ కార్డు ఈటెల రాజేందర్ బహుబాగా వినియోగించుకోబోతున్నారు హుజూరాబాద్ ఉప ఎన్నికలో. బీజేపీలో ఈటెల చేరిన దరిమిలా, ఈటెల బలం రెట్టింపయ్యిందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అందుకే, స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. నాగార్జున సాగర్ తరహాలోనే పక్కా స్కెచ్ వేస్తున్నారు. అయితే, ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్నదానిపై స్పష్టత లేదు. బీజేపీ గనుక అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తే.. దుబ్బాక తరహాలో నాయకుల్ని మోహరిస్తే.. హుజూరాబాద్ తిరిగి ఈటెల వశమవడం ఖాయం. ఈ విషయమై గులాబీ దళంలోనూ స్పష్టత వున్నట్లే కనిపిస్తోంది.. గులాబీ దళం డౌట్లు పడుతోందంటే.. ఈటెల రాజేందర్ గెలుపు ముందే ఖాయమైపోయిందనుకోవాలా.?