రాజకీయం సుస్పష్టంగా అందరికీ అర్థమవుతోంది. ఈటెల రాజేందర్ అనే వ్యక్తిని మంత్రి పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి బయటకు పంపాలనే నిర్ణయానికి ఎప్పుడో వచ్చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం. అయితే, అందుకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూసింది. ఈటెల రాజేందర్ అంటే రాజకీయ నాయకుడే కాదు, ఉద్యమ నాయకుడు కూడా గనుక.. దెబ్బ కాస్త గట్టిగానే కొట్టాలి. దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్, నాగార్జున సాగర్ ఎన్నికలతోపాటు, మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తయ్యాక అసలు కథ మొదలైంది. వేటు గట్టిగానే పడింది. తొలుత శాఖ తొలగింపు, ఆ తర్వాత మంత్రి వర్గం నుంచి బర్తరఫ్.. ఇలా వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇక, ఈటెల రాజకీయంగా కీలకమైన నిర్ణయం తీసుకోవడమే తరువాయి. ఇప్పటికే ఆయన కూడా నిర్ణయం తీసేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదేంటన్నది కాస్సేపట్లో తేలబోతోంది. పార్టీ నుంచి తనను బయటకు పంపేముందు, తానే పార్టీ నుంచి బయటకు వెళ్ళాలని ఈటెల నిర్ణయించుకున్నారా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘కారు పార్టీకి మేం ఓనర్లం.. కిరాయిదార్లం కాదు..’ అని గతంలో నినదించిన ఈటెల రాజేందర్, ఆ కారు పార్టీపై హక్కుని సాధించుకుంటారా.? లేదంటే, విధిలేని పరిస్థితుల్లో కారు పార్టీ నుంచి బయటకు వెళతారా.? అంటే, రెండో ఆప్షన్ వైపే ఆయన మొగ్గు చూపాలి. ఎందుకంటే, ఆయనకు వేరే దారి లేదు. కాంగ్రెస్ పార్టీ పిలుస్తోంది.. బీజేపీ ఆహ్వానిస్తోంది. మరి, ఈటెల భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా వుండబోతోంది.? ఇవన్నీ ఓ ఎత్తు.. ఈటెల అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా.? అన్న ప్రశ్న ఇంకో యెత్తు.