తెలంగాణ రాష్ట్ర సమితి నేతగా దాదాపు రెండు దశాబ్దాలపాటు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈటెల రాజేందర్, తొలిసారి భారతీయ జనతా పార్టీ నేతగా సొంత నియోజకవర్గం హుజూరాబాద్ వెళ్ళారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెంటివేయబడే స్థాయికి పరిస్థితులు దిగజారడంతో, ఈటెల రాజేందర్.. అంతకన్నా ముందే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాగా, అత్యంత వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ మీద ‘రాజకీయాస్త్రం’ ప్రయోగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన్ని అదను చూసి దెబ్బకొట్టారు, మంత్రి పదవి నుంచి తొలగించడం ద్వారా.
ఈ నేపథ్యంలో ఈటెల, కేసీఆర్ మీద రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారు. అందుకోసం భారతీయ జనతా పార్టీని సరైన వేదికగా ఎంచుకున్నారు కూడా. అయితే, హుజూరాబాద్ ఉప ఎన్నిక త్వరలో జరగనున్నందున, ఆ ఉప ఎన్నికలో ఈటెల తన ‘పవర్’ చాటుకోగలరా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఈటెల రాజేందర్, నిన్న మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక నేత. ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితికి బలం.. ఈటెలకు తెలంగాణ రాష్ట్ర సమితి బలం. ఇప్పుడిక ఒంటరిగా ఈటెల రాజేందర్ తన సత్తా చాటాల్సి వుంటుంది.
బీజేపీ అండదండలున్నా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ ఏ మేరకు తన బలాన్నంతా కేంద్రీకరించగలుగుతుంది.? అన్నది ఇప్పుడే చెప్పలేం. దుబ్బాకలో బీజేపీ దుమ్ము రేపింది. కానీ, నాగార్జునసాగర్ విషయానికొచ్చేసరికి చేతులెత్తేసింది. అనుచరులతో శామీర్ పేట నుంచి హుజూరాబాద్ వరకూ ఈటెల రాజేందర్ హంగామా బాగానే చేయగలిగారు. హుజూరాబాద్‌లో ఘన స్వాగతాన్నీ అందుకున్నారు. అంతా బాగానే వుంది.. మరి, ఓటర్ల మాటేమిటి.? తనను గెలిపించిన ప్రజలను అడిగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటున్న ఈటెల వారి మద్దతుతో తిరిగి గెలుస్తారా.? వేచి చూడాల్సిందే