Etela Rajender: కేసీఆర్ ను ఢీ కొట్టేలా ఈటల స్కెచ్.. అదిరింది..!

Etela Rajender: తెలంగాణ రాజకీయాలు సీఎం కేసీఆర్ వర్సెస్ మాజీ మంత్రి ఈటలగా మారిపోయాయి. మొదటిరోజు సీఎం కేసీఆర్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోయినా.. శాఖలను తీసేసుకున్న తర్వాత ఈటల స్వరం పెంచారు. కేసీఆర్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తనను విమర్శిస్తున్న మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్ పైనా కౌంటర్లు వేశారు. ఇవన్నీ ఒకెత్తైతే.. ఆయన ప్రెస్ మీట్లలో తాను ఉద్యమం నుంచీ ఎదిగిందీ కేసీఆర్ వల్లేనని చెప్పారు. కేసీఆర్ తోపాటే ఉద్యమంలో తిరిగితే కుటుంబం ఏమవ్వాలి? అని తన భార్య చాలాసార్లు ప్రశ్నించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచీ ఉన్న తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కూడా డిమాండ్ చేశారు.

నిజానికి ఈటల వ్యవహారాలను పరిశీలిస్తే ఆయన ఏ క్షణానైనా రాజీనామా చేసేస్తారనే భావించారు అంతా. మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేస్తారనే భావించారు. కానీ.. ఆయన తొందరపడలేదు. తాను కేసీఆర్ ను ఎంత నమ్మిందీ.. ఉద్యమ సమయంలో ఉద్యమకారులన కాచుకుందీ.. తాను ఎంత పోరాటం చేసిందీ.. కేసీఆర్ అడుగుజాడల్లో ఎలా నడుచుకుందీ చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే కేసీఆర్ పై ఈటల సై అంటే సై అనేందుకు సిద్ధమయ్యారనే తెలుస్తోంది. పైగా.. ఈ అంశంలో మాట తూలకుండా ఈ పరిణామాలన్నీ వివరించి తెలంగాణ ప్రజల్లో సానుభూతి పొందేందుకే ప్రయత్నించారని చెప్పాలి. లేదంటే.. పదవులకు రాజీనామా, కేసీఆర్ పై మాటలు విసిరే సందర్భాలే ఎదుర్కొన్నారు ఈటల.

కానీ.. ఆయన తీరు కేసీఆర్ కు ఎదురెళ్లకుండా సరిసమానంగా ఎదుర్కొనేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రి పదవులను సీఎం బదలాయించుకునే వరకూ.. ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ శ్రేణుల డిమండ్ వచ్చేవరకూ చూశారు. అందుకే రాజీనామా చేయలేదు. పైగా.. సానుభూతి వచ్చేలా.. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. కేసీఆర్ కావాలనే కక్షగట్టారని చెప్పి.. తెలంగాణ ప్రజలకు జరుగుతున్నదేంటో తెలుసు అంటూ కేసీఆర్ గురించి ప్రజలు ఆలోచించేలా చేశారని చెప్పాలి. మొత్తంగా కేసీఆర్ గురించి తెలిసిన వ్యక్తిగా ఆయన్ను ఢీ కొట్టాలంటే ఏం చేయాలో అన్నీ చేశారు. మరి.. రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి..!