తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపించడంలేదు. త్వరలో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం ప్రకటిస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఇంతకీ, ఆ కీలక నిర్ణయం ఎలా వుంబోతోంది.? కొత్త రాజకీయ పార్టీ పెడతారా.? కాంగ్రెస్ పార్టీ వైపు వెళతారా.? బీజేపీ వైపు ఆయన చూడబోతున్నారా.? ఈ ప్రశ్నల చుట్టూ రాజకీయ వర్గాల్లో ఆసక్తకిరమైన చర్చ జరుగుతోంది. ఈటెల విషయమై తెలంగాణలోని అధికార పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆయన వేస్తోన్న ప్రతి అడుగునీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఈటెల స్థానంలో టీఆర్ఎస్ నుంచి బలమైన నేతని నిలబెట్టేందుకు ఇప్పటికే పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే గులాబీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు వెళ్ళాయి. ఈటెలకు వ్యతిరేకంగా గులాబీ నేతలు విమర్శల బాణాల్ని సంధిస్తున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం తెలంగాణ రాష్ట్ర సమితికి వెన్నుదన్నుగా వున్న ఈటెల, అనూహ్యంగా పార్టీ నుంచి గెంటివేయబడ్డారు.. మంత్రి పదవి నుంచి తొలగించబడ్డారు.
ఈ క్రమంలో ఈటెల ఏ పార్టీలో చేరినా, ఆ పార్టీకి అదనపు అడ్వాంటేజ్ అవుతుందన్నది నిర్వివాదాంశం. ఈ కారణంగానే బీజేపీ, ఈటెల విఝయమై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈటెలకు గాలం వేస్తున్న, ఆయన కాంగ్రెస్ కంటే బీజేపీనే బెటర్.. అన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అతి త్వరలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ విషయమై అధిష్టానం సూచన మేరకు రంగంలోకి దిగి చర్చలు జరపబోతున్నారట. ఈటెలను తాను త్వరలో కలుస్తానని కూడా కిషన్ రెడ్డి సంకేతాలు పంపడం గమనార్హం. ఈటెల గనుక బీజేపీలోకి వెళితే, ఇప్పటిదాకా ఆయన్ని వెనకేసుకొచ్చిన కాంగ్రెస్ నుంచి ఆయనకు తీవ్రస్థాయిలో విమర్శలు తప్పకపోవచ్చు. ఏమో, ఈటెల ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారోగానీ, ఈలోగా ఆయన ఇమేజ్ మాత్రం మసకబారుతోంది. ఆలస్యం అమృతం విషం.. అన్నారు పెద్దలు అందుకే మరి.