తెలంగాణ: ప్రజా దీవెన యాత్రలో భాగంగా బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో పాదయాత్ర నిర్వహించిన ఈటల రాజేందర్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర లో భాగంగా ఈటల మాట్లాడుతూ.. కేసీఆర్కు బుద్ధి చెప్పాలని హుజూరాబాద్ ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. దళిత బంధు పేరిట సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఈటల విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి.. దానిని ఎదుర్కొంటున్న తనకు మధ్య పోరు అని ఈటల అభివర్ణించారు. మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.
ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంట బీజేపీలోకి వెళ్లిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తిరిగి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులను కూడా టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ ఈటలను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మూడెత్తుల మల్లేష్ యాదవ్ టీఆర్ఎస్ లో చేరారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో మల్లేష్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈటల అనుచరులుగా ఉన్న జమ్మికుంట మునిసిపల్ వైఎస్ చైర్ పర్సన్ దేశినేని స్వప్న ఆమె భర్త ఇల్లందకుంట రామాలయ మాజీ చైర్మన్ కోటి తిరిగి గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈటలతో కలిసి వీరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ.. ఇప్పుడు ఉన్నట్టుండి టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని ప్రకటించారు. ఈ మేరకు ఒక లేఖను కూడా వారు విడుదల చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాయభారంతోనే ఈ మార్పు జరిగినట్టు చెబుతున్నారు. ఇంకా మరికొందరని కూడా టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యేందుకు అధికార పార్టీ ప్రతినిధులు తతంగం పూర్తి చేశారని తెలుస్తుంది.