హుజురాబాద్: ఉప ఎన్నిక పాదయాత్రలో భాగంగా శనివారం ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఈటెల తనపై కెసీఆర్ చేసిన ఆరోపణలకు తనదైన శైలిలో జవాబిచ్చారు. దళిత బంధుపై కేసీఆర్ హుజురాబాద్‌లోని ఓ పిల్లాడితో మాట్లాడాడంటూ సెటైర్లు వేశారు. ఎదురించేవాళ్లంతా కేసీఆర్‌కు చిన్న మనుషులులానే కనిపిస్తారని, ఆయన తానొక పెద్ద మేధావి, పెద్ద మనిషి అనుకుంటూ ఉంటారని విమర్శించారు. కానీ “చలి చీమల చేత చిక్కి చావదే సుమతి” అన్న మాటను కేసీఆర్ గుర్తుచేసుకోవాలని హేచ్చరించారు.
ఆరుసార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచినా ధర్మంగానే గెలిచానని ఈటల అన్నారు. 2008, 2010లో రాజీనామా చేస్తే భారీ మెజారిటీతో తనను గెలిపించారని, ప్రజలే తనకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారని ఆయన అన్నారు. తన పక్కన ఎవరూ ఉండకుండా చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని, వారు డబ్బు, అధికారాన్ని నమ్మితే తాను ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. టీఆర్ఎస్ బీఫాంతోనే తాను గెలిస్తే… మరి, అదే బీఫాంతో పోటీ చేసిన కెసిఆర్ కూతురు కవిత ఎందుకు ఓడిపోయారని గూబ గుయ్యమనేలా ప్రశ్నించారు. 2023లో రాష్ట్రంపై కాషాయ జెండా ఖాయమని ఈటల జోస్యం చెప్పారు.