ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్.. టీఆర్ఎస్‌కి కూడా.!

Etela Rajender Resigns From MLA Post!

Etela Rajender Resigns From MLA Post!

ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పేశారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ రోజు మీడియా ముఖంగా ఈటెల రాజేందర్ వెల్లడించారు.

ఈ క్రమంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఈటెల. ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమకారులైన నాయకులకు అవమానాలు జరుగుతున్నాయనీ, మంత్రి హరీష్ రావు కూడా అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారని ఈటెల ఆరోపించారు. ‘

ఉరి తీసే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు.. నా మీద అనామకులు ఆరోపణలు చేస్తే, కనీసం ముఖ్యమంత్రి నన్ను సంజాయిషీ కోరలేదు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఈటెల, కష్ట కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెంట నడిచాననీ, తనను గత ఐదేళ్ళుగా ఘోరంగా అవమానించినా, పార్టీ కోసం ఆ అవమానాల్ని భరించాననీ అన్నారు.

‘ఆస్తులమ్ముకుని అయినా బతుకుతా.. ఆత్మగౌరవం కోల్పోయి మాత్రం బతకలేను..’ అని ఈటెల వ్యాఖ్యానించారు. ఒకప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్‌కీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కీ చాలా తేడా వుందన్న ఈటెల, ఐదేళ్ళుగా పార్టీతో, పార్టీ అధినేతతో గ్యాప్ వచ్చిందని అన్నారు. ఇన్నేళ్ళూ ఆ అవమానాల్ని భరించింది తెలంగాణ సమాజం కోసమేననీ, ఇకపై తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరగా వుంటానని ఈటెల చెప్పుకొచ్చారు.

బెంజి కార్లలో వచ్చి రైతు బంధు తీసుకునేవారి గురించి తాను మాట్లాడితే, సంక్షేమ పథకాలు దండగని అంటున్నానంటూ తన మీద దుష్ప్రచారం చేశారనీ, అధికార పార్టీకి చెందిన మీడియాలో వెకిలి వ్యాఖ్యానాలు చేయిస్తూ, వెకిలి కథనాలు ప్రసారం చేయిస్తున్నారనీ ఈటెల మండిపడ్డారు. ‘గెలవడం నాకు కొత్త కాదు.

ప్రతిసారీ నన్ను గెలిపించింది ప్రజలే. రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ఆ ప్రజలే నిర్ణయిస్తారు.. నేనెవరికీ భయపడను..’ అంటూ ఈటెల తనదైన స్టయిల్లో వ్యాఖ్యానించారు.