ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్.. ఓ పనైపోయింది.!

Etela Finally Resigns To MLA Post

ఎట్టకేలకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు బి-ఫామ్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి అయినా, తనను గెలిపించింది మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలేననీ, వాళ్ళంతా తనను ప్రేమతో ఇన్నాళ్ళూ గెలిపించారనీ, ఇకపైనా గెలిపిస్తారనీ, ప్రజల సూచన మేరకు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక నేతగా ఎదిగిన ఈటెల రాజేందర్, అనూహ్యంగా మంత్రి పదవి నుంచి తొలగింపబడ్డారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. భూ కబ్జా ఆరోపణలతో ఈటెలకు తెలంగాణ రాష్ట్ర సమితిలో పొగపెట్టారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇప్పటికే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న ఈటెల రాజేందర్ ఈ నెల 14న ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం కండువా భుజాన వేసుకోనున్నారు.

బీజేపీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్ నిన్ననే ఈటెల రాజేందర్‌ని కలిశారు.. తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేతల్ని వెంటేసుకుని. మరోపక్క, నేటినుంచే హుజూరాబాద్‌లో బీజేపీ మార్కు వ్యూహాల్ని అమలు చేయాల్సిందిగా బీజేపీ అధిష్టానం స్థానిక నాయకత్వానికి సూచించింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వస్తే, ఈటెల రాజేందర్ పోటీ చేస్తారా.? ఆయన సతీమణిని రంగంలోకి దించుతారా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

కాస్సేపటి క్రితం తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ‘సరైన ఫార్మాట్’లో రాజీనామా పత్రాన్ని సమర్పించారు ఈటెల రాజేందర్. ఆయన రాజీనామాకు అసెంబ్లీ స్పీకర్ ఆమోద ముద్ర వేయడమే తరువాయి. అయితే, పార్టీ ఫిరాయించిన నేతలపై వేటు వేయకుండా ఈటెల రాజీనామాని ఆమోదిస్తే.. అది స్పీకర్ మీద రాజకీయంగా పెద్ద మచ్చ పడేందుకు కారణమవుతుందన్న విమర్శలూ లేకపోలేదు.