పీఎఫ్.. చిరుద్యోగి అయినా పెద్ద ఉద్యోగి అయినా.. ప్రభుత్వ ఉద్యోగి అయినా.. ప్రైవేటు ఉద్యోగి అయినా అందరికీ పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ ఉంటే.. పదవీ విరమణ పొందిన తర్వాత నెల నెలా పింఛను వస్తుంది. ఉద్యోగం లేకున్నా.. పీఎఫ్ డబ్బులతో పదవీ విరమణ తర్వాత జీవితాన్ని ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడపొచ్చు. కేంద్ర ప్రభుత్వం అందరు ఉద్యోగులకు అందిస్తున్న గొప్ప పథకం ఇది.
అయితే.. ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తూ పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త అందించింది. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పీఎఫ్ ఆఫీసు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రైవేటు ఉద్యోగుల కోసం పదవీ విరమణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పదవీ విరమణ పొందిన రోజే ఉద్యోగికి పింఛన్ మొదలవుతుంది.
ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఇది నిజంగా గొప్ప వరం. ఎందుకంటే.. ప్రైవేటు ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక భద్రత ఉండదు. అటువంటి వాళ్లను ఈపీఎఫ్ఓ పింఛను రూపంలో ఆదుకోబోతోంది.
ఈనెల 30 నుంచే కొత్త విధానం అమల్లోకి రానుంది. నిజానికి పదవీ విరమణ తర్వాత ఉద్యోగి తన పింఛన్ కోసం నెలల తరబడి వేచి చూడాలి. వెంటనే పింఛన్ ప్రారంభం కాదు. పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేది. అప్లికేషన్ పెట్టడం.. కంపెనీ నుంచి లెటర్ తీసుకురావడం.. ఇలా పెద్ద ప్రాసెసే ఉండేది. వీటన్నింటికీ చెక్ పెట్టి.. ఆన్ లైన్ లోనే ఉద్యోగి పదవీ విరమణ పొందగానే ఆటోమెటిక్ గా ఆ ఉద్యోగికి అదే రోజు నుంచి పింఛన్ ను రావడం ప్రారంభం అవుతుంది.