ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చేసిన సిఫార్సును కేంద్రం యథాతథంగా ఆమోదించింది. గత ఆర్థిక సంవత్సరం 2023-24లోనూ ఇదే స్థాయిలో వడ్డీ రేటు చెల్లించారు.
ఇందుతో దేశవ్యాప్తంగా సుమారు 7 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇది శుభవార్తగా మారింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఉద్యోగులు, ప్రత్యేకించి ప్రైవేట్ ఉద్యోగస్తులకు గట్టి ఊరటనిచ్చినట్లయింది. ఈపీఎఫ్ ఓ ఖాతాల్లో డిపాజిట్ చేసే మొత్తం పై వడ్డీ మొత్తాన్ని త్వరలోనే ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈపీఎఫ్‌ఓ అధికారులు తగిన ఏర్పాట్లు ప్రారంభించారు.
తక్కువ మదుపుతో భవిష్యత్‌కు భద్రత కలిగించే ఈపీఎఫ్ స్కీం పట్ల మధ్యతరగతి ఉద్యోగుల్లో విశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో, వడ్డీ రేటును స్థిరంగా కొనసాగించడం పాజిటివ్ అభివృద్ధిగా విశ్లేషకులు చెబుతున్నారు. చక్కటి రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఈ స్కీమ్‌ను ఎక్కువమంది ఉద్యోగులు ఎంపిక చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం వారికి మదుపు విలువను పెంచేలా ఉంటుంది.