టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఈఎస్ ఐ స్కామ్ లో ఏసీబీ అరెస్ట్ చేసి విచారణ చేపడుతోన్న సంగతి తెలిసిందే. అచ్చెన్న అరెస్ట్.. గాయం కారణంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలన్న అంశంపై నడిచిన హైడ్రామా గురించి తెలిసిందే. చివరికి గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలోనే అచ్చెన్నాయుడు ని విచారించారు. తాజాగా ఆ విచారణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మూడు రోజుల పాటు అచ్చెన్నను విచారించారు. ఈ మూడు రోజులు కలిపి దాదాపు పదిన్నర గంటల పాటు విచారించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. మొదటి రోజు మూడు గంటలు, రెండవ రోజు ఐదు గంటలు, మూడవ రోజు రెండున్నర గంటలపాటు విచారించినట్లు తెలుస్తోంది.
ఈఎస్ ఐ టెలీ హెల్త్ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లపై, టెలీ హెల్త్ సేవలకు సంబంధించి సిఫార్సు లేఖపై అచ్చెన్న సంతకం చేయడంపైనా ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలలో వేటికి అచ్చెన్న సరైన బధులివ్వలేదని అధికారలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. అడిగిన ఏ ప్రశ్నలకు అచ్చెన్న మనసు విప్పి సమాధానం చెప్పలేదన్నారు. కొనుగోళ్ల సమయానికి తాను మంత్రిగా లేనని, తెలంగాణ మాదిరి వాటి అమలుపై అధ్యయనానికి సూచించానని, మినిట్స్ కు సంబంధించి సంతకంపై కొనుగోళ్ల ఫైల్ తన వద్దకు రాలేదని చెప్పినట్లు సమాచారం.
కాగా కస్టడీ సమయం ఈ రోజు ఐదు గంటలతో పూర్తయింది. అచ్చెన్నాయుడి గాయం కూడా తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అచ్చెన్నను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విరేచనాలు, నడుం నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. మరి అచ్చెన్న అసంతృప్తి సమాధానాల నేపథ్యంలో మరోసారి విచారణ చేపడతారా? లేక తాజా విచారణనే ఆధారంగా చేసుకుని చర్యలకు దిగుతారా? అన్నది తేలాలి.