AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడు నెలలుగా కూటమి పార్టీలన్నీ ఎంతో సవ్యంగా పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల మహాసేన రాజేష్ ఒక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు ఎంతటి ప్రభావాన్ని చూపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా మహాసేన రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలను ఎంతోమంది తెలుగుదేశం సీనియర్ నాయకులు మంత్రులు కూడా స్పందిస్తూ నారా లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి కావడానికి పూర్తిస్థాయిలో అర్హతలు కలిగి ఉన్నవాడని స్పష్టం చేశారు.
ఇలా పార్టీ సీనియర్ నేతలు చేసిన ఈ వ్యాఖ్యలతో కూటమి పార్టీలో డిప్యూటీ సీఎం వార్ నడిచింది అయితే ఈ యుద్ధానికి ఎండ్ కార్డు వేశారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈయన అనంతరం ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇటీవల మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గురువారం విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో లోకేశ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ…టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేశేనని, బాబు తర్వాత మా ముఖ్యమంత్రిగా లోకేష్ ఉంటారంటూ కామెంట్లు చేశారు.ఈ విషయం నేను కాదు, చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు’ అన్నారు. ప్రభుత్వంలో పదవులను కూటమి నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు.
గత ప్రభుత్వం మా పార్టీని భూస్థాపితం చేయాలని చూసింది అలాంటి సమయంలో మా యువ నేత నారా లోకేష్ పాదయాత్ర పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తూ పార్టీ తిరిగి నిలబడటానికి ఎంతగానో కృషి చేశారు ఆయన పాదయాత్ర కారణంగానే 2024వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీని కైవసం చేసుకుందని తెలియజేశారు.