చాలామంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. వందలో 90 మంది దగ్గర స్మార్ట్ ఫోన్లే. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు అనే తేడా లేదిప్పుడు. ఎవరిదగ్గర చూసినా స్మార్ట్ ఫోన్లు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిందే. ఆ అకౌంట్ ద్వారానే యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కానీ.. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సైట్లలోకి లాగిన్ అవడం లాంటివి చేస్తుంటారు.
అయితే ఆన్ లైన్ మనం ఏం చేస్తున్నా… సైబర్ నేరగాళ్లు మనపై ఓ కన్నేసి ఉంచుతారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకోవాలంటే మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవాలి. దాని కోసం గూగుల్ సెట్టింగ్స్ వెళ్లి.. ఈ చిన్న పని చేస్తే చాలు.. మీ జీమెయిల్ అకౌంట్ చాలా సురక్షితంగా ఉంటుంది. సైబర్ నేరగాళ్లు కిందా మీదా కొట్టుకున్నా మీ అకౌంట్ ను హ్యాక్ చేయలేరు.
దాని కోసం ఏం చేయాలంటే.. మీ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి.. అందులో గూగుల్ సెట్టింగ్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో గూగుల్ అకౌంట్ ఆప్షన్ మీద టాప్ చేయండి. అక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. గెట్ స్టార్టెడ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత.. ట్రై ఇట్ నవ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు గూగుల్ మీ మొబైల్ నెంబర్ ను అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేశాక.. ఆ నెంబర్ కు ఓటీపీ పంపిస్తుంది. దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతే.. 2 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయినట్టే.
మరెప్పుడైనా.. ఎక్కడైనా మీరు మీ జీమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలంటే.. యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో పాటుగా.. మీ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీ ఖాతాను వేరేవాళ్లు ఓపెన్ చేసే అవకాశమే ఉండదు.