Employees Hiccups : ఉద్యోగుల్ని నిండా ముంచేసిన ‘నేతలు’ ఎవరు.?

Employees Hiccups : ఉద్యోగులకు రాజకీయ నాయకులు శతృవులనే అభిప్రాయం కొన్ని సార్లు వినిపిస్తుంటుంది. ఉద్యోగుల్ని ప్రభుత్వాలు ముంచేశాయన్న మాట ఆయా సందర్భాల్లో వినిపిస్తుంటుంది. కానీ, నిజానికి ఉద్యోగుల్ని నిండా ముంచేసేది ఉద్యోగ సంఘాల నాయకులే. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు బాగుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలోనూ ఉద్యోగ సంఘాల నాయకులే బాగుపడ్డారు. తెలంగాణలో విభజన ఉద్యమ సమయంలోనూ లాభపడ్డది ఉద్యోగ సంఘాల నాయకులే. ఆంధ్రప్రదేశ్‌లో ఆరడుగుల బుల్లెట్టు గురించి తెలియనిదెవరికి.?

ఇక, ఇప్పుడు ఏపీలో ఉద్యోగులు కొత్త పీఆర్సీ వద్దు.. అంటూ నినదిస్తున్న విషయం విదితమే. కానీ, ఉద్యోగ సంఘాల నేతలే తొలుత ఈ పీఆర్సీకి ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి అత్యద్భుతమైన రీతిలో ఉద్యోగ సంఘాలకు తీపి కబురు చెప్పినట్లు ఇదే ఉద్యోగ సంఘాల నాయకులు సెలవిచ్చారు. ఎప్పుడైతే, హెచ్చార్యే వ్యవహారం బయటకు వచ్చిందో.. దాంతో సీన్ మారిపోయింది.

నిజానికి, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలతో చర్చల సమయంలోనే చాలామంది ఉద్యోగులకు చాలా అనుమానాలు వచ్చాయి. ‘అలా ఎలా రాజీపడతారు.?’ అంటూ పీఆర్సీ ప్రకటన తర్వాత ఉద్యోగులు బాహాటంగానే పెదవి విరిచినా, ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం తగ్గేదే లే.. అన్నారు.

పదవీ విరమణ వయస్సు పెంచడమంటే కొంతమందికి లబ్ది, చాలామందికి నష్టం.. అన్న కనీస ఇంగితం ఉద్యోగ సంఘాల నాయకులకు లేకుండా పోయింది. తాము పదవీ విరమణ చేస్తే అర్హులైన యువతకు ఉద్యోగాలు వస్తాయనీ, అలా ఉద్యోగాలు తెచ్చుకునేవారిలో తమ పిల్లలు కూడా వుండొచ్చన్న సోయ లేని ఉద్యోగ సంఘాల నాయకులు.. ఉద్యోగుల్ని నిండా ముంచేశారు. అందుకే, ఉద్యోగుల ఉద్యమం అతీ గతీ లేకుండా పోతోంది.