ఈడీ విచారణ: పూరి జగన్నాథ్ ఏం చెప్పారు.?

సినీ దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల యెదుట విచారణకు హాజరయ్యారు. కొన్నాళ్ళ క్రితం వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి పూరి జగన్నాథ్ సహా పలువురు సినీ ప్రముఖుల్ని అప్పటి తెలంగాణ సిట్ విచారించిన విషయం విదితమే. ఆ కేసుకి సంబంధించి ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఈడీ, ఒక్కొక్కరికీ విచారణ నిమిత్తం ఒక్కో తేదీని కేటాయించింది. అందరికంటే ముందుగా ఈ రోజు పూరి జగన్నాథ్ వంతు వచ్చింది. అయితే, విచారణలో పూరి జగన్నాథ్ ఏం సమాధానాలిచ్చారు.? అసలు ఈడీ ఎలాంటి ప్రశ్నలు గుప్పించింది.? అన్నదానిపై బిన్న వాదనలున్నాయి. మీడియా స్పెక్యులేషన్స్ ప్రకారం చూస్తూ, దాదాపు ఐదేళ్ళ కాలానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల సమాచారాన్ని ఈడీ కోరిందనీ.. పూరి జగన్నాథ్ ఆ వివరాల్ని ఈడీకి అందజేశారనీ తెలుస్తోంది. ఆయా వివరాల్ని ఈడీ పరిశీలిస్తోందట.

డ్రగ్స్ కేసులో అక్రమ నగదు లావాదేవీలు జరిగాయన్నది ఈడీ అనుమానంగా ప్రచారం జరుగుతోంది. ఈడీ రంగంలోకి దిగిందంటేనే, ఈ కేసులో అక్రమ లావాదేవీల వ్యవహారం నడిచినట్లన్నది మీడియా వర్గాల్లో వినిపిస్తోన్న కథనాల సారాంశం. ‘డార్క్ వెబ్’ ద్వారా డ్రగ్ పెడ్లర్స్ పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారనే అనుమానంతో ఈడీ, ఆ కోణంలో విచారణ షురూ చేసిందని అంటున్నారు. అయితే, బయట జరుగుతున్న ప్రచారానికీ, విచారణ జరుగుతున్న తీరుకీ ఏమన్నా పొంతన వుందా.? లేదా.? అన్నది తేలాల్సి వుంది. అటు ఈడీ అయినా, ఇటు సినీ ప్రముఖులైనా ఈ విషయాలపై అధికారికంగా స్పందిస్తేనే పూర్తి స్పష్టత వస్తుంది. ఈలోగా సినీ పరిశ్రమ మీదా, పరిశ్రమలోని వ్యక్తుల మీదా మీడియా సాక్షిగా వచ్చే కథనాలు.. ఆయా సినీ నటుల అభిమానుల్ని కలవరపాటుకి గురిచేయడం మామూలే.