వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జగన్ అండ చూసుకుని హద్దులు దాటిపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటివారి మూలంగా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలే ఇబ్బందులుపడుతున్నారు. బయటివారినే కాదు సొంత పార్టీ నేతలను కూడ ఈ ఎమ్మెల్యేలు లెక్కచేయట్లేదు. అంతా నాదే అనే రీతిలో వెళుతూ కలహాలకు కారణమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో కాకినాడ సిటీ కూడ ఒకటి. వాణిజ్యం పరంగా, రాజకీయంగా ఈ స్థానానికి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ వైసీపీ నుండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.
అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో ఆయనకు ఎమ్మెల్యే అయినా ఒదిగేదేమీ ఉండేది కాదు. కానీ 2019 ఎన్నికల్లో పార్టీ గెలవడం, ఆయన కూడ విజయం దక్కించుకోవడంతో వెనక ముందు చూసుకోవట్లేదు. జగన్ వద్ద మంచి గుర్తింపు ఉన్న నేతల్లో ఈయన కూడ ఒకరు. అందుకు కారణం సామాజికవర్గమే అంటుంటారు చాలామంది. రెడ్డి కావడం మూలానే హైకమాండ్ ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయట. ఇక జగన్ వెనకున్నారంటే ఆగేదేముంది. అందుకే ద్వారంపూడి దున్నిపారేస్తున్నారట. కాకినాడ సిటీలో నియోకజకవర్గమే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడ వేలు పెట్టేస్తున్నారట.
జిల్లాలోని మరొక నియోజకవర్గం పిఠాపురంలో వైసీపీ తరపున పెండెం దొరబాబు గెలిచారు. ఈయన 2004లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి 2014 నాటికి వైసిపీలో చేరారు. ఆ ఎన్నికలో ఓడినా 2019 ఎన్నికల్లో గెలిచారు. తూగో జిల్లాలో మొదటి నుండి రెడ్డి వర్గం కాకుండా వేరొక వర్గం హవా ఉంటుంది. పార్టీ ఏదైనా గోదావరి జిల్లాల్లో వీరిదే పైచేయి. అయితే దీన్నే మార్చడానికి ద్వారంపూడి కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు. ఆ వర్గం నేతలను ఖాతరు చేయకుండా పనులు చేసుకుపోతున్నారు. వారిలో దొరబాబు కూడ ఉన్నారు. ఆయన నియోజకవర్గం పరిధిలోనే కాదు పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ పరిధిలో ప్రభుత్వ కాంట్రాక్టులను పైనున్న తన వర్గం వారి సహకారంతో దక్కించుకుంటున్నారట.
అది దొరబాబుకు నచ్చట్లేదు. వేరొక ఎమ్మెల్యే తన అసెంబ్లీలో వేలు పెట్టడం ఏమిటని ఉడికిపోతున్నారట. కానీ ఏమీ చేయలేకపోతున్నారట. కారణం పైనున్న రెడ్డి వర్గమేనట. వారిని ధిక్కరించలేరు కాబట్టి చేసేదేం లేక అసహనంతోనే మిగిలిపోతున్నారట. ద్వారంపూడి వ్యవహారం ఈయనకే కాదు జిల్లాలోని చాలామంది లీడర్లకు నచ్చట్లేదట.