దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. గెలిచి రెండు రోజులు కూడా కాలేదు.. అప్పుడే దూకుడు పెంచారు. దుబ్బాక ఎన్నికల సమయంలో సిద్ధిపేటలో జరిగిన గొడవకు సంబంధించి ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు. సిద్ధిపేటలో ఆయన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ ఆయన తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార సమయంలో సిద్ధిపేటలో రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బులు దొరికాయని పోలీసులు హడావుడి చేసిన విషయం తెలిసిందే. దానిపై అప్పుడు పెద్ద రచ్చే జరిగింది. రఘునందన్ రావు బంధువు ఇంట్లో ఉంచిన 18 లక్షలను సోదాలు చేసి పట్టుకున్నామని పోలీసులు తెలిపినా.. అదంతా కట్టుకథ అని.. అవి తమ డబ్బులే కాదని… తన మీద అకారణంగా కేసు నమోదు చేశారని.. దాన్ని కొట్టేయాలని రఘునందన్ రావు తన పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే.. ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి.. చీఫ్ జస్టిస్ బెంచ్ విచారిస్తుందని.. జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. అలాగే.. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశావరు.
రఘునందన్ రావు బంధువు ఇంట్లో ఓటర్ల కోసం పంచిపెట్టాలనుకున్న డబ్బును దాచారని సమాచారం అందడంతో.. తాము సోదాలు నిర్వహించగా.. అందులో సుమారు 18 లక్షల నగదు దొరికిందని.. దాన్ని పోలీసులు తీసుకొని వస్తుండగా.. రఘునందన్ అనుచరులు సుమారు 12 లక్షల రూపాయలను లాక్కెళ్లారని పోలీసులు.. వాళ్లపై కేసులు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే.