వైఎస్ జగన్ కు, వైసీపీకి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనూ అభిమానులున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నారు. ఆంధ్రా సెటిలర్లు హైదరాబాద్ సిటీలో ఎక్కువ. వారిలో వైసీపీకి అభిమానించేవారు మెండుగా ఉన్నారు. కూకట్ పల్లి లాంటి ఏరియాల్లో వారి ఓట్లే కీలకం. అందుకే ఎన్నికలు ఏవైనా వీరిని ప్రసన్నం చేసుకోవడానికే పార్టీలన్నీ ప్రయత్నం చేస్తుంటాయి. చివరికి కేసీఆర్ సైతం నిన్నమొన్నటి వరకు వైసీపీతో, జగన్ తో సఖ్యతగా ఉంటూ రావడానికి గల ప్రధాన కారణాల్లో జగన్ అభిమానులు కూడ రీజన్. ఈమధ్య తప్పనిసరి కావడంతో ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ విభేదించారు. దీనికే ఎక్కడ ఓట్లు ఎగిరిపోతాయోననే కంగారులో ఉన్నారు.
అలాంటిది బీజేపీ ఏకంగా వైఎస్ఆర్ విషయంలోనే పెద్ద తప్పు చేసింది. ఆ పార్టీ నుండి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు వైఎస్ఆర్ మరణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను సైన్స్ టీచర్ని. ప్రకృతిని నమ్ముతాం. వెనకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు. పావురాల గుట్టల. నువ్వు కూడా గంతే. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది అంటూ వైఎస్ మరణాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ మీద విమర్శలు గుప్పించడానికి ట్రై చేశారు. దీంతో వైసీపీ వర్గాలు విరుచుకుపడుతున్నాయి. సోషల్ మీడియాలో రఘునందన్ రావు మీద వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రజల కోసం వెళుతూ కన్నుమూసిన ప్రజానేత ఆయన. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేనేలేదు అంటూ విరుచుకుపడుతున్నారు. నిజానికి వైఎస్ఆర్ మరణం గురించి ప్రస్తావించాల్సిన అవసరం కానీ, సందర్భం కానీ రఘునందన్ రావుకు అక్కడ లేవు. కేసీఆర్ మీద విమర్శలు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలే ఉన్నాయి. ఇక శాపనార్థాలు, బెదిరింపులు చేయాలంటే వేరే విధంగా చేసుకుని ఉండాల్సింది. అంతేకానీ మహానేత అకాల మరణం గురించి అదేదో శిక్ష అన్నట్టు వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరైన చర్య కానే కాదు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడ ఏనాడూ వైఎస్ మరణాన్ని ఇలా తక్కువచేసి మాట్లాడింది లేదు. ఈ తప్పు బీజేపీకి ఈ గ్రేటర్ ఎన్నికల్లోనే తెలిసొచ్చే అవకాశం ఉంది.
పైన చెప్పుకున్నట్టు ఆంధ్రా సెటిలర్లు బీజేపీకి మొండిచేయి చూపిస్తే చాలా స్థానాల్లో దెబ్బతినాల్సి వస్తుంది. ఇక్కడున్న ఇంకొక ప్రమాదం ఏమిటంటే ఆంధ్రాలో కూడ బీజేపీ బలపడాలని అనుకుంటోంది. అక్కడి నేతలు పట్టు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి టైంలో తెలంగాణ బీజేపీ ఇలా నోరు పారేసుకోవడం ఆంధ్రాలో పెద్ద సమస్యగా మారే అవకాశం లేకపోలేదు.