Drunken Coconut: తాగి పారేసిన కొబ్బరికాయలతో బిజినెస్..!

Drunken Coconut: మనం కొబ్బరి బోండాలు తాగిన తర్వాత పడేస్తూ ఉంటాం. వాటిని వ్యర్థ పదార్థంగా భావించి చెత్తలో కూడా పడేస్తాం. కానీ తాగి పడేసిన బోండాలతోనే ఓ వ్యక్తి బిజినెస్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. అతనికి ఎలా ఈ ఐడియా వచ్చింది అని అనుకుంటున్నారా.! అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

హైదరాబాద్‌ కుంట్లూర్‌ కు చెందిన నాగరాజు అనే వ్యక్తి తన సొంత వాహనాలను కొబ్బరి బోండం కేంద్రాల వద్దకు పంపిస్తారు. వీధివ్యాపారుల వద్ద తాగి పడేసిన బోండాలను సేకరిస్తాడు. ఆ వాడి పారేసిన బోండాల ద్వారా వివిధ వస్తువుల్లో వాడే ముడిపదార్థాన్ని తయారు చేస్తున్నారు.

హయత్‌నగర్‌ సమీపంలోని కుంట్లూరులో పాతికేళ్ల క్రితం కొబ్బరికాయలతో నాగరాజు తండ్రి ఈ బిజినెస్ ని ప్రారంభించారు. ఆ తరువాత కొబ్బరికాయల కొరత ఏర్పడటంతో … నాగరాజు తెలివిగా కొబ్బరికాయల బదులుగా వ్యాపారంలో కొబ్బరి బోండాలను ఉపయోగించాడు. రోజూ కనీసం 3.5 టన్నుల బోండాల నుంచి 50 శాతం పీచు, 50శాతం కొబ్బరి ఎరువును తయారు చేస్తున్నాడు. వాటిని హైదరాబాద్‌ లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఈ పీచును సోఫాలు, కుర్చీలు, విగ్రహాలు సహా చాలా వస్తువుల తయారీలో వాడతారు. ఈ బిజినెస్ లో కుటుంబ సభ్యులతో పాటు మరో 12 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు నాగరాజు.

ఈ వ్యాపారానికి కనీసం 20 లక్షల పెట్టుబడి అవుతుందని చెప్పారు. అంతేకాకుండా వీటికి సంబంధించిన యంత్రాలను, పనిముట్లను సొంతంగా తయారు చేసుకుంటామని నాగరాజు తెలిపారు. ఉత్సాహవంతులకు యంత్రాలు తయారు చేసి ఇవ్వడమే కాకుండా, వారు ఉత్పత్తి చేసిన సరుకును తామే కొని మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.