మన దేశంలో ఏ దేవాలయానికి వెళ్లినా.. ముందు గా భక్తులు దేవునికి కొబ్బరికాయలు, అరటిపండ్లు సమర్పిస్తుంటారు. అయితే దీనికి కారణం ఏంటో మీకు తెలుసా. నిజానికి దీని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఎంతో ఆసక్తికరమైనది. హిందూ సంప్రదాయంలో దేవాలయం అంటే భక్తి, గౌరవానికి ప్రతీక. భక్తులు తమ కోరికలు చెప్పేందుకు ఆలయాలను ఆశ్రయిస్తారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వెళ్లి ప్రమాణం నెరవేర్చడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అలాంటి సందర్భాల్లో దేవుడికి సమర్పించే రెండు ముఖ్యమైన ఫలాలు.. కొబ్బరికాయ, అరటిపండు.
ఇవన్నీ భగవంతుడికి అత్యంత పవిత్రమైన నైవేద్యంగా పరిగణించబడతాయి. కానీ వీటిని ప్రత్యేకంగా ఎందుకు సమర్పిస్తారో అనేదే అసలు ప్రశ్న. దీని వెనక ఆచారాన్ని మించిపోయే ఆధ్యాత్మికత ఉంది. ఇతర పండ్లు విత్తనాల ద్వారా పునరుత్పత్తి అవుతాయి. వాటిని జంతువులు తిన్నా, మనుషులు వేసినా.. విత్తనం మళ్లీ మొలకెత్తుతుంది. అంటే వాటిలో ఒక తాత్కాలిక జీవన చరిత్ర ఉంటుంది. కానీ కొబ్బరికాయ, అరటిపండ్లకు అది ఉండదు. అవి తినిన తర్వాత మళ్లీ మొలకలు రావు. అందుగే వాటిని భగవంతుడికి సమర్పిస్తారు.
ఇక కొబ్బరికాయలోని మూడు కన్నులు ఉంటాయి.. అవి భూత, వర్తమాన, భవిష్యత్తును సూచిస్తాయి. కొబ్బరి పైన ఉన్న పెంకు బాహ్యపు అహంభావానికి చిహ్నం. దాన్ని పగలగొట్టి లోపల స్వచ్ఛమైన గుండెను చూపించాలన్నది ఒక ఆధ్యాత్మిక సందేశం. కొబ్బరిలోని నీరు మన ప్రేమ, భక్తిని చిహ్నంగా సూచిస్తుంది. ఇక అరటిపండు కూడా అతి ప్రత్యేకమైనది. ఒక చెట్టు తన జీవితంలో ఒక్కసారే ఫలిస్తుంది. ఆ తర్వాత తన స్థానాన్ని తన నుంచే పుట్టిన కొత్త మొలకలకు అప్పగించి మౌనంగా నశిస్తుంది. ఇది త్యాగానికి అద్భుతమైన ప్రతీక.
ఈ రెండు ఫలాలు జీవిత గమనాన్ని, ఆత్మశుద్ధిని, త్యాగాన్ని ప్రతిబింబిస్తాయి. అందుకే దేవునికి సమర్పించే సమయానికి ఇవి ప్రాధాన్యం పొందాయి. ఇవి ఆచారంగా మాత్రమే కాక, జీవిత ధర్మాన్ని బోధించే సాధనాలుగా మారాయి. ఇప్పటివరకు ఈ విషయం గురించి ఆలోచించి ఉండకపోవచ్చు.. కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత, ప్రతిసారి దేవుడిని దర్శించే వేళ, ఈ ఫలాలను తీసుకెళ్లే ముందు ఆలోచన మారిపోతుంది. ఇవి భక్తి కన్నా లోతైన అర్థాన్ని అందించే పవిత్ర మైనది.
