Drugs Mania : డ్రగ్స్ రగడ: తెలంగాణలో మళ్ళీ లొల్లి.! ఈసారేమవుతుందో.!

Drugs Mania :  డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్.. ఈ రచ్చ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొన్నాళ్ళ క్రితం తెలంగాణలో పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. అప్పట్లో కింగ్ పిన్ కెల్విన్.. అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు టోనీ అనే పేరు వినిపిస్తోంది. అప్పట్లో ఆ కేసు విచారణ సీరియస్‌గానే జరిగింది.. కానీ, సిల్లీగా ఆ వ్యవహారం ముగిసిందనే ఆరోపణలున్నాయి.

మరి, ఇప్పుడేమవుతుంది.? టోనీ వ్యవహారంలో సినీ ప్రముఖులు, వ్యాపర ప్రముఖులే కాదు.. విద్యార్థులపైనా ఆరోపణలున్నాయనే వాదనలు మీడియా కథనాల రూపంలో తెరపైకొస్తున్నాయి. మరి, ఈ కేసులో అరెస్టయ్యే ప్రముఖులు ఎవరు.? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడంలేదు.

గతంలో తెలంగాణలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సినీ ప్రముఖులపై ఆరోపణలు వచ్చినా, సినీ ప్రముఖులెవరూ అరెస్టు కాలేదు. దాదాపుగా అందరికీ క్లీన్ చిట్ వచ్చేసినట్టే. సో, ఇప్పుడు కూడా కేసు అలాగే నీరుగారిపోవడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

అయినా, డ్రగ్స్ అనగానే ముందుగా సినీ పరిశ్రమకు చెందినవారిపై ఎందుకు ‘ఫోకస్’ వెళుతోంది.? బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో కూడా పలువురు సినీ ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కన్నడ సినీ పరిశ్రమలోనూ అంతే. పలు సందర్భాల్లో సినీ ప్రముఖులు అరెస్టవడం కూడా చూస్తున్నాం. కానీ, ఆ తర్వాత ఆ కేసులు వీగిపోతున్నాయ్.

డ్రగ్స్ వాడకం సమాజంలో పెరుగుతూనే వుంది తప్ప తగ్గడంలేదు. డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతున్నాయని ప్రభుత్వాలు చెప్పడమే తప్ప, ఆ ఉక్కుపాదం తాలూకు ఫలితాలైతే కనిపించడంలేదు.