డ్రగ్స్ రగడ: విపక్షాల తీరుపై సీఎం జగన్ అసహనం

డ్రగ్స్ విషయమై అప్రమత్తంగా వుండాలని అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గంజాయి, గుట్కా వంటివాటి అక్రమ రవాణా విషయంలో అత్యత అప్రమత్తంగా వుండాల్సిందేనని స్పష్టం చేశారు. డ్రగ్స్ వ్యవహారానికి రాష్ట్రంతో సంబంధం లేకపోయినా విపక్షాలు కుట్ర పూరిత రాజకీయం చేస్తున్నాయని అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశంలోకి అక్రమంగా విదేశాల నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్ స్మగుల్ అవుతున్న మాట వాస్తవం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగా ఓ వ్యక్తి, డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. అయితే, విజయవాడలోని ఓ ఇంటిని తన వ్యాపారం కోసం అడ్రస్‌గా చేసుకుని, మిగతా కార్యకలాపాలన్నిటినీ చెన్నయ్ నుంచే నడుపుతున్నాడు సదరు నిందితుడు. అతనిది ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం.

కేసులో నిందితుడు అరెస్టయ్యాడు.. అసలు ఆ స్మగ్లింగ్‌తో తనకు సంబంధం లేదంటున్నాడు. ఈ కేసుని కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణ జరుపుతున్నాయి. నిజానిజాలేంటన్నది విచారణలో తేలుతుంది. ఈలోగా డ్రగ్స్ వెనుక కీలక పాత్రధారులు ప్రభుత్వ పెద్దలేనని ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేరుగా ముఖ్యమంత్రి పైనే విమర్శలు చేస్తుండడం గమనార్హం. విజయసాయిరెడ్డి ఎందుకు మాట్లాడటంలేదు డ్రగ్స్ వ్యవహారంపై.? అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాజాగా ప్రశ్నించి కలకలం సృష్టించారు.

డ్రగ్స్ వ్యవహారం అత్యంత సున్నితమైనదీ, ప్రమాదకరమైనది. ఊరికే రాజకీయ విమర్శలు చేయడం ద్వారా సమాజంలో అలజడి రేగుతుంది. విపక్షాలు ఈ విషయంలో సంయమనం పాటించాలి. అయితే, పెద్దమొత్తంలో గంజాయి రాష్ట్రం నుంచి స్మగ్లింగ్ అవుతుండడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. ఎంతలా ఈ స్మగ్లింగ్ మీద ఉక్కుపాదం మోపుతున్నా గంజాయి స్మగ్లింగ్‌ని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు అధికారులు.