IPL 2020: షార్జాలో సన్‌రైజర్స్‌కు షాక్‌.. కనీసం పోరాడలేదు

షార్జాలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘోర ఓటమి చవిచూసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13లో భాగంగా ఆదివారం ఇక్కడి మైదానంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఆరెంజ్‌ ఆర్మీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యఛేదనలో వార్నర్‌ సేన తడబడింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం, కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది. సారథి వార్నర్‌ (60) అసాధారణ పోరాటం చేయగా.. బెయిర్‌ స్టో(25), మనీశ్‌ పాండే(30) ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఏ ఇతర బ్యాట్స్‌మన్‌ కూడా వార్నర్‌కు పూర్తి స్తాయి సహకారం అందించలేదు. దీంతో ఆరెంజ్‌ ఆర్మీకి ఓటమి తప్పలేదు.

Mumbai Indians won by 34 runs

ఇక అంతకుముందు టాస్‌ గెలిచన ముంబై బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే ముంబైకు భారీ షాక్‌ తగిలింది. సారథి రోహిత్‌ (6) సందీప్‌ శర్మ బౌలింగ్‌లో ఔటై తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో జట్టును ఆదుకునే బాధ్యతను డికాక్‌-సూర్యకుమార్‌ యాదవ్‌లు తీసుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు తన బ్యాట్‌కు సమాధానం చెప్పని డికాక్‌ (67) కీలక సమయంలో రాణించాడు. డికాక్‌ తోడు సూర్యకుమార్‌(27), ఇషాన్‌ కిషాన్‌ (31), హార్దిక్‌ (28) తలో చెయ్యి వేయగా.. చివర్లో పొలార్డ్‌(25నాటౌట్‌), కృనాల్‌(20 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, సిద్ధార్త్‌ కౌల్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.