షార్జా: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి కోపమొచ్చింది. అది కూడా ఆటగాళ్లపై కాదు ఏకంగా అంపైర్లపేనే. మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టామ్ కరన్ ఔట్ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. తొలుత టామ్ కరన్ ఔటైనట్లు ప్రకటించిన అంపైర్ తర్వాత సందేహం కలగడంతో థర్డ్ అంపైర్‌కు నివేదించాడు. అది నాటౌట్‌గా తేలింది. అయితే ఒక్కసారి నిర్ణయం ప్రకటించిన తర్వాత మళ్లీ చర్చించడం ఏంటని సీఎస్‌కే సారథి ధోని అంపైర్లపై అసహనం వ్యక్తం చేశాడు.
రాజస్తాన్ బ్యాటింగ్ సందర్భంగా దీపక్ చహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదో బంతికి కరన్ ఔటైనట్లు (కీపర్ క్యాచ్) అంపైర్ షంషుద్దీన్ ప్రకటించాడు. అయితే ఆ బంతి తన బ్యాట్‌కు తగల లేదని అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ కరన్ క్రీజులోనే ఉండిపోయాడు. దీంతో తన నిర్ణయంపై తనకే డౌట్ వచ్చిన షంషుద్దీన్ మరో అంపైర్ కులకర్ణితో చర్చించి మూడో అంపైర్‌కు నివేదించాడు. రిప్లైలో బంతి బ్యాట్‌కు తగలకపోగా, ధోని కూడా ఆ బంతిని నేలనుతాకిన తర్వాతే అందుకున్నాడు. అయితే క్యాచ్ కాని క్యాచ్‌పై ధోని అంపైర్లపై వాదనకు దిగడం ఏంటని నెటిజన్లతో పాటు విమర్శకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది ఐపీఎల్‌లో రాజస్తాన్తో మ్యాచ్‌లోనే మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదనకు దిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్(74; 32 బంతుల్లో 1×4, 9×6), స్టీవ్ స్మిత్(69; 47 బంతుల్లో 4×4, 4×6) సిక్సుల వర్షం కురిపించగా.. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్(27; 8 బంతుల్లో 4×6) సైతం అదే పనిచేశాడు. 217 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్(72; 36 బంతుల్లో 1×4, 7×6) చెలరేగినా ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. షేన్‌వాట్సన్(33), మురళీ విజయ్(21), సామ్ కరన్(17), కేదార్ జాధవ్(22) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. చివరి ఓవర్‌లో కెప్టెన్ ధోనీ(28; 16 బంతుల్లో 3×6) హ్యాట్రిక్ సిక్సులు బాదడంతో ఆ జట్టు స్కోర్ 200కి చేరింది.