తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాన పార్టీలు తమ తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ మరియు తెరాస పార్టీలు ఈ ఎన్నికలకు చాలా సీరియస్ గా తీసుకోని ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. దుబ్బాక గెలుపుతో దూకుడు మీదున్న బీజేపీ ఎలాగైనా గ్రేటర్ లో మంచి ఫలితాలు సాధించి, తెరాసను ఢీ కొట్టే సత్తా తమకే ఉందని మరోసారి నిరూపించాలని పట్టుదలతో ఉంటే, చాపకింద నీరులా వ్యాప్తిస్తూన్న బీజేపీ విషయంలో జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన తెరాస ఈ గ్రేటర్ లో మరోసారి గులాబీ జెండా ఎగరవేసి బీజేపీది బలం కాదు వాపు అని నిరూపించాలని అనుకుంటున్నారు..
కేసీఆర్ వ్యూహం సరైనదేనా..
సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలపై గట్టిగానే ఫోకస్ చేశాడు , అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగితే కనీసం వాటిపై కూడా చూడని కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల కోసం భారీ ప్రణాళికలే సిద్ధం చేసుకుంటున్నాడు. ఎన్నికలు అయ్యిపోయే దాక ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకోకుండా పార్టీ వ్యవహారాలే చూడటం, ముఖ్యంగా గ్రేటర్ లో గెలుపుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు, అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో చివరి రోజు హైదరాబాద్ నడిబొడ్డున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకయ్యా అంటే బీజేపీకి చెక్ పెట్టటం కోసమే అని తెలుస్తుంది. గ్రేటర్ లో బీజేపీకి మొదటినుండి కొంచం పట్టు ఉంది , మొన్నటి దుబ్బాక ఫలితంతో గ్రేటర్ లో మరింత బలపడింది బీజేపీ, మరోపక్క బీజేపీ పార్టీనే ప్రధాన ప్రతిపక్షముగా భవిస్తూ విమర్శలు చేయటం, కేవలం రాష్ట్ర బీజేపీ మీదనే కాకుండా కేంద్రంలో నున్న మోడీ సర్కార్ మీద కూడా కేసీఆర్ ఎదురుదాడి చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ విషయంలో ఉదాసీనతగా వ్యవహరిస్తే తమకు ఇబ్బందులు ఖాయమని భావించి కేంద్ర సర్కార్ పై యుద్ధం చేయటానికి నిర్ణయం తీసుకున్నాడు.
మోడీని ఢీ కొట్టే సమయం ఇదేనా..?
గత కొద్దీ రోజుల నుండి కేసీఆర్ మోడీ మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నాడు, తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని అస్థిర పరచటానికి కేంద్ర బీజేపీ పన్నాగాలు పన్నుతోందని ఆరోపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు రావటంతో ఆ విమర్శలకు పదును పెంచటమే కాకుండా వచ్చే నెల రెండో వారంలో దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న ప్రాంతీయ పార్టీల నేతలతో హైదరాబాద్ లోనే సమావేశం ఏర్పాటు చేసి, మోడీపై యుద్ధం చేస్తానని కేసీఆర్ ప్రకటించాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మోడీని ఢీ కొట్టి నిలబడగలిగే సత్తా కేసీఆర్ కు ఉందా..? అనేది ఆలోచించాలి. మొన్న జరిగిన బీహార్ ఎన్నికలు కావచ్చు, వివిధ రాష్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కావచ్చు బీజేపీ విజయ ఢంకా మోగించింది. మోడీ సర్కార్ పై వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేసిన ప్రతిపక్షాలు ఆ ఫలితాలను చూసి మౌనం వహిస్తున్నాయి,. దీనితో మోడీకి అదనపు బలం చేకూరింది. పైగా ఎన్నికలకు మూడేళ్ళ సమయం ఉంది, ఈ లోపు తొందర పడి చూస్తూ చూస్తూ మోడీతో కయ్యం పెట్టుకోవటం మంచి పరిణామం కాదు.
ఎన్నికల కోసమే యుద్దమా..?
ప్రస్తుతం బలంగా కనిపిస్తున్న మోడీతో యుద్ధం చేయాల్సివస్తే దాని పరిణామాలు ఏమిటో కేసీఆర్ కు బాగానే తెలుసు, వచ్చే ఏడాది బెంగాల్ ఎన్నికలు, ఆ తర్వాత తమిళనాడు ఎన్నికలు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ వ్యతిరేక పార్టీలు మోడీతో యుద్దానికి సిద్ధం అయ్యాయి, కానీ తెలంగాణ లో ఆ పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ మోడీతో కయ్యం ఎందుకు కోరుకుంటున్నాడు అంటే అది కేవలం గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసమే అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
రాష్ట్ర బీజేపీ నేతలపై ఎలాంటి విమర్శలు చేసిన పెద్దగా లాభం ఉండదని భావించే సీఎం కేసీఆర్ ఏకంగా మోడీని టార్గెట్ చేశాడని, ఎన్నికలు అయ్యేదాకా మోడీతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించి ఆ తర్వాత సైలెంట్ అయిపోతాడని, అందులో భాగంగానే డిసెంబర్ 2 వ వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి తాడో పేడో తేల్చుకుంటామని చెపుతున్నాడు ,కానీ ఆలోపే ఎన్నికలు పూర్తయ్యి డిసెంబర్ 4 న ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత సమావేశం జరిగిన జరగకపోయిన కేసీఆర్ పెద్దగా పోయేది ఏమి లేదు. కాకపోతే మోడీని ఎదిరించి ఎదో చేయబోతున్నాడు అనే అభిప్రాయం జనాల్లో కలిగించడంలో కేసీఆర్ సక్సెస్ అవుతాడు. మోడీతో యుద్దమంటూ మాట్లాడటం కేవలం ఎన్నికల కోసం చేసే గిమ్మిక్కులు తప్పితే మరొకరి లేదని కేసీఆర్ రాజకీయం గురించి తెలిసినవాళ్ళు చెపుతున్నారు