ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న టీడీపీ వేరు. ప్రస్తుతం చంద్రబాబు చేతుల్లో ఉన్న టీడీపీ వేరు. పేరు ఒకటే కానీ.. సిద్ధాంతాలు వేరు. 2014లో అధికారంలోకి ఎలాగొలా వచ్చినా.. 2019 లో మాత్రం టీడీపీ నెగ్గుకురాలేకపోయింది. వైసీపీ ముందు కుదేల్ మంది. అంతేనా.. ప్రస్తుతం టీడీపీలో నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. అసలు.. సరైన నాయకులు కూడా లేరు. యువ నాయకులైతే మచ్చకు ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఇలాగే ఉండే పార్టీ త్వరలోనే నామరూపం లేకుండా పోతుంది.. అని అనుకున్నారో ఏమో.. చంద్రబాబు ప్రస్తుతం కొత్త పాట పాడుతున్నారు.
నిజానికి ఏపీలో రాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న నేతల్లో చంద్రబాబే ముందు వరుసలో ఉంటారు. ఆయనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. పార్టీలో ఎవరిని ఎలా చూడాలి.. ఎవరిని ఎక్కడ నొక్కితే ఎక్కడ సెట్ అవుతారు.. అనేటువంటి అన్ని విషయాలు తెలిసిన నేత చంద్రబాబు. అందుకే.. మూడు దశాబ్దాల నుంచి టీడీపీని కాపాడుకుంటూ వస్తున్నారు.
2004 వరకు తనే రాజు. కానీ.. 2004లో సీన్ రివర్స్ అయింది. అయినా చంద్రబాబు ఏమాత్రం బెనకలేదు. 2009లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అయినా కూడా చంద్రబాబు బాధపడలేదు. వరుసగా పదేళ్ల పాటు అధికారం లేకున్నా కూడా పార్టీని, క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చారు. 2014లో విజయం సాధించారు.
ఇప్పుడు కూడా అంతే. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీ క్యాడర్ దెబ్బతినకుండా ఉండటం కోసం జమిలి ఎన్నికలు అనే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు చంద్రబాబు అంటూ వార్తలు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై కసరత్తు చేస్తోందని.. ఎలాగైనా ఇంకో రెండేళ్లలో దేశమంతా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని.. అప్పుడు మళ్లీ మనకు అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంటుందని చంద్రబాబు పార్టీ క్యాడర్ కు చెబుతూ వస్తున్నారట. మరో రెండేళ్లలో ఎన్నికలు అంటే ఇక పార్టీ నాయకులు కూడా పోటీకి సన్నద్ధం అవుతుంటారు కదా.. అందుకే అన్నమాట.
మరి.. అంత ఖచ్చితంగా చంద్రబాబు జమిలి ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని ఎలా చెప్పగలుగుతున్నారు. కేంద్రం నుంచి ఆయనకు పక్కా సమాచారం ఉందా? ఏపీ సీఎం జగన్ కు తెలియకుండా… కేవలం చంద్రబాబుకే కేంద్రం నుంచి జమిలి ఎన్నికల గురించి సమాచారం వచ్చిందా? అనే సందేహాలు వెలువడుతున్నాయి.