నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి మత్తు డాక్టర్ సుధాకర్ అజ్ఞాంతంలోకి వెళ్లిపోయారా? వారం..పది రోజుల పాటు ఒంటరిగానే జీవించాలనుకుంటున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. సుధాకర్-ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదం గురించి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ విచారిస్తోంది. అయితే ఇటీవలే హైకోర్టులో హెబియస్ కార్పాస్ పిటీషన్ మేరకు తీర్పులో భాగంగా సుధాకర్ ని డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్లొచ్చని కోర్టు తెలిపింది. దీంతో సుధాకర్ తల్లి కావేరి బాయి ఇంటికి తీసుకెళ్లారు. అయితే నిన్నటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు సమాచారం. కుటుంబ సభ్యులు సహా సుధాకర్ ఎవర్నీ కలవడానికి, గానీ, మాట్లాడటానికి ఇష్టపడలేదుట.
కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉంటానని కుటుంబ సభ్యలకు చెప్పి ఆయన ఓ రహస్య ప్రాంతంకి చేరుకున్నట్లు సమాచారం. విశాఖలోనే ఆయనకు మాత్రమే తెలిసిన ప్రదేశంలో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. సుధాకర్ ఆమె తల్లిని కూడా కలవడానికి ఇష్టపడటం లేదని చెబుతున్నారు. కేవలం తనకు మానసిక ప్రశాంతత కావాలని ఆయన కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే సుధాకర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన తల్లి ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోన్న నేపథ్యంలో సుధాకర్ ఉన్నటుండి అజ్ఞాతాన్ని కోరుకోవడంతో కొత్త అనుమానాలకు తావిస్తున్నట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది.
విశాఖలోని ఆయన ఏ ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నారో? ఏ సమయంలో ఏం చేస్తున్నారు? ఉదయం నుంచి రాత్రి పడుకునే వరక ఆయన దిన చర్య ఏంటి? అన్న వివరాలు ఎప్పటికప్పుడు ప‌్రభుత్వ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారుట. ఆయన మానసిక స్థితి సరిగ్గా లేని నేపథ్యంలోనే అధికారులు నిఘా పెడుతున్నట్లు తెలుస్తోంది. సుధాకర్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణల్లో భాగంగా ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని విశాఖ మానసిక వైద్యశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.