Tirupathi: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి తిరుమల గిరులలో కొలువై ఉండి భక్తుల కోర్కెలు తీర్చుతూ వారి కొంగు బంగారం చేస్తూ కలియుగ దైవంగా ప్రసిద్ధి చెందారు. ఇక స్వామివారి దర్శనానంతరం రోజుకు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు తిరుపతి చేరుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. మనకు ఏదైనా ఆపద వస్తే ఆపద మొక్కుల వాడా అనాధరక్షకా గోవిందా అని స్మరిస్తే చాలు మన ఆపదలను తొలగిస్తాడు. ఇలా కలియుగ దైవంగా పేరుప్రఖ్యాతలు సంపాదించిన శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు పెద్ద ఎత్తున ముడుపులు కడుతుంటారు.
భక్తులకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు స్వామివారిని నమస్కరించుకుని ఆ సమస్య నుంచి బయట పడితే ముడుపు చెల్లిస్తామని స్వామివారికి ముడుపులు కడతారు. ఈ విధంగా మనం ఆ కష్టాల నుంచి బయట పడగానే ఆ ముడుపుతో సహా స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామికి ముడుపు చెల్లించుకోవాలి. మరి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఏవిధంగా కట్టాలి అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
స్వామి వారికి ముడుపు కట్టాలి అంటే శనివారం ఎంతో మంచి రోజు. శనివారం ఉదయమే స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని ఇంటిలో పూజ చేయాలి. పూజ అనంతరం ఒక తెల్లటి వస్త్రాన్ని తడిపి ఆ వస్త్రానికి పసుపు రాసి పెట్టాలి. ఆ పసుపు ఆరిన తర్వాత నాలుగు మూలల కుంకుమ పెట్టి మనకు తోచినంత 11 రూపాయలు లేదా 21 ఇలా మనకు తోచినంత ముడుపు అందులో వేసి ఆ వస్త్రానికి మూడు ముడులు వేయాలి. ఈ విధంగా ముడుపు కట్టిన ఆ వస్త్రాన్ని వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఉంచి మన సమస్యలు తొలగిపోయినప్పుడు తిరుమలకు చేరుకుంటామని నమస్కరించుకోవాలి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి ఆ సమస్య తీరిన తర్వాత చెల్లించడానికి తిరుపతి వెళ్లి ఆ ముడుపుతో పాటు వడ్డీని కూడా తిరుపతి హుండీలో వేయటం వల్ల స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయని భావిస్తారు.