జనసైనికులు వద్దంటున్నారు.. జనసేనాని ఏమంటారో.!

Do not ally with BJP-Janasenalaku

Do not ally with BJP-Janasenalaku

భారతీయ జనతా పార్టీతో పొత్తు వద్దే వద్దంటున్నారు జనసైనికులు. పార్టీ వేదికల మీద ఈ అభిప్రాయాల్ని జనసైనికులు వ్యక్తం చేయడానికి సరైన సమయం, సందర్భం కలిసి రావట్లేదేమో.. సోషల్ మీడియా వేదికా అధినేతకు ‘బీజేపీతో పొత్తు వద్దు’ అని తెగేసి చెబుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారమొక్కటే కాదు, ప్రత్యేక హోదా సహా చాలా విషయాల్లో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందంటూ జనసైనికులు వాపోతున్నారు. ఈ మేరకు సవివరంగా పేర్కొంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర వేదికల ద్వారా అధినేతకు తెలియజేస్తున్నారు జనసైనికులు. అయితే, వీళ్ళంతా నిజంగానే జనసైనికులా.? కాదా.? అన్నదానిపై స్పష్టత లేదు. ఒక్కటి మాత్రం నిజం.. న్యూస్ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లోనూ జనసేన పార్టీ నేతలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక విలవిల్లాడుతున్నారు. ‘బీజేపీతో అంట కాగడం ద్వారా జనసేన నష్టపోతోంది కదా.? బీజేపీతో కలవడం వల్ల మీకు వచ్చే అదనపు లాభమేంటి.? రాష్ట్రానికి జరుగుతున్న మేలు ఏంటి.?’ అని ఇతర పార్టీలు ప్రశ్నిస్తుంటే, అక్కడా తెల్లమొహం వెయ్యాల్సి వస్తోంది జనసేన నేతలకి. తమ అధినేత పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలకుండా చూసుకోగలరేమోగానీ, బీజేపీ పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు మిత్రపక్షంగా జనసేన సమాధానం చెప్పాల్సి వస్తే, అదెంత కష్టమైన వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

విశాఖ ఉక్కు విషయంలో ఇప్పటికే కేంద్రానికి రిప్రెజెంటేషన్ ఇచ్చామనీ, అవసరమైతే ఇంకోసారి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని జనసేన అధినేత కలుస్తారని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. మరోపక్క బీజేపీ నేతలు, మీడియా ముందుకు వచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయడంలేదు తాజా పరిణామాల నేపథ్యంలో ‘విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ జరగదు’ అని ఏపీ బీజేపీ నేతలు కొందరు చెప్పారు.. అందులో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వున్నారు. అయితే, సుజనా చౌదరి లాంటి కొందరు బీజేపీ నేతలు మాత్రం, ‘ప్రైవేటీకరణ ఆగదు’ అని తేల్చేసిన సంగతి తెలిసిందే.