రాజకీయం తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ అవసరం లేదా.?

పాత పేరుతో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, పలు జాతీయ సంస్థలు.. ఇలా చాలా చాలా అవసరం. కానీ, ఇవేవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేదు.. కేవలం రాజకీయ వివాదాలు మాత్రం చాలు.. అనే స్థాయికి, రాష్ట్రంలో రాజకీయం దిగజారిపోయింది.

ప్రత్యేక హోదా గురించి ప్రధాన రాజకీయ పార్టీలేవీ ఆంధ్రప్రదేశ్‌లో అస్సలు ఆలోచించడంలేదు. పోలవరం ప్రాజెక్టు గురించిన శ్రద్ధ అసలే లేదు. పోనీ, రాజధాని గురించిన ఆలోచన ఏమైనా వుందా.? అంటే, అదీ లేదాయె. రైల్వే జోన్ గురించీ ఎవరూ పట్టించుకోవడంలేదు. విశాఖ స్టీలు ప్లాంటుని కేంద్రం ప్రైవేటీకరిస్తున్నా, నిలదీసేంత చిత్తశుద్ధి ఏ రాజకీయ పార్టీకీ కనిపించడంలేదు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు చుట్టూ ఎంత వివాదం నడుస్తోందో చూస్తున్నాం. అసలెందుకీ రచ్చ.? టీడీపీకి, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం నచ్చలేదు. నిరసన వ్యక్తం చేయొచ్చు.. తప్పులేదు. కానీ, అదేదో ఆత్మగౌరవ సమస్య.. అన్నట్లు మాట్లాడితే ఎలా.? అధికార వైసీపీ విషయాన్నే తీసుకుంటే, ప్రత్యేక హోదా కంటే కూడా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడమే అతి ముఖ్యమైన విషయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావించడం అత్యంత శోచనీయం.

రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రాన్ని అడగలేని అచేతనావస్త రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల్లో కనిపిస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే సమయమంతా గడిచిపోతోంది. మూడేళ్ళవుతున్నా ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు.? పోలవరం ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేకపోయాం.? లాంటి అంశాలపై వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోలేకపోతోంది. అదే సమయంలో టీడీపీ సైతం, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్న ఇంగితాన్ని కోల్పోతోంది.