రోడ్లకు గుంతలు.! వైసీపీ సర్కారుకి ఇబ్బందులు.!

Dirty Roads

తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి.. రోడ్లు పాడైపోతున్నాయ్.! దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి మరింత దారుణం. గత మూడేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి నానాటికీ దిగజారుతోంది. ప్రభుత్వం చెప్పే మాటలకి, చేస్తున్న పనులకీ రోడ్ల విషయంలో అస్సలు పొంతన వుండడంలేదు.

వర్షాలు పడుతున్నాయ్.. రోడ్లు పాడైపోతున్నాయ్.. అనడం వైసీపీకి పరిపాటిగా మారిపోయింది. నిజమే, వర్షాలు పడుతున్నాయ్.. రోడ్లు పాడవుతున్నాయ్. కానీ, బాగు చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది కదా.?

జనసేన పార్టీ కావొచ్చు, భారతీయ జనతా పార్టీ కావొచ్చు, తెలుగుదేశం పార్టీ కావొచ్చు.. రోడ్ల దుస్థితిపై వైసీపీని విమర్శించిన ప్రతిసారీ ఎదురుదాడి మాత్రమే చేస్తోంది అధికార పక్షం. కానీ, ప్రజలు మాత్రం దారుణమైన రోడ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మళ్ళీ వానాకాలం వచ్చేసింది. దాంతో, విపక్షాలు రోడ్లెక్కుతున్నాయ్.. రోడ్లపై గుంతల మీద పోరాటాలు చేస్తున్నాయ్. వాస్తవానికి జులై 15 నాటికి రోడ్ల మీద గుంతలే వుండవంటూ గతంలో వైసీపీ సర్కారు ఘనంగా చెప్పుకుంది. జులై 15 రానే వచ్చింది.

రోడ్లపై గుంతలు అంతకు మించి.. అనే స్థాయిలో దర్శనమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లో అయితే, రోడ్ల మీద గుంతలు కాదు.. గుంతల నడుమ రోడ్డు అక్కడక్కడా కనిపిస్తోందనే పరిస్థితి నిజంగానే నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వచ్చే ఎన్నికల్లో ఈ రోడ్ల అంశం.. అధికార వైసీపీకి పెను సవాల్ విసరనుంది.