వినాయక చవితిపై ఏపీలో చెత్త రాజకీయం.!

Vinayaka Festival.

కాదేదీ రాజకీయానికి అనర్హం.! కాదు కాదు, కాదేదీ చెత్త రాజకీయానికి అనర్హం. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో వైసీపీ సర్కారు ఏవో అర్థం పర్థం లేని నిబంధనలు, ఆంక్షలు విధిస్తోందంటూ తొలుత భారతీయ జనతా పార్టీ రచ్చ షురూ చేసింది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు.. టీడీపీ, జనసేన కూడా అదే బాటలో వైసీపీని విమర్శించడం మొదలు పెట్టాయి.

‘నాన్సెన్స్.. ఎవరో ఆరోపిస్తున్నట్లు, ఆంక్షలేమీ లేవు..’ అని వైసీపీ సర్కారు క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు పోలీసు శాఖ నుంచి కూడా స్పష్టమైన ప్రకటన వచ్చింది. అయినాగానీ, ఏపీలో వినాయక చవితి చుట్టూ చెత్త రాజకీయం అయితే అలా అలా జరుగుతూనే వుంది. దేశంలో ఎక్కడా లేని రచ్చ వినాయక చవితి ఉత్సవాలపై ఏపీలోనే ఎందుకు జరుగుతోంది.?

కాస్త లోతుల్లోకి వెళితే, అమరావతి పరిధిలో వైసీపీ మహిళా నేత ఒకరు, గతంలో ఓ వినాయక మండపం దగ్గరకు వెళితే, సొంత పార్టీ నేతల మధ్యనే యాగీ జరిగింది. వినాయక మండపాల చుట్టూ రాజకీయ చెత్త ఏ స్థాయిలో వుంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.

నిజానికి, ఈ తరహా వివాదాల్ని రాజకీయాలకతీతంగా చూడాలి. వైసీపీలోనే కుంపట్లు వున్నప్పుడు, విపక్షాలు వాటిని హైలైట్ చేయకుండా వుంటాయా.? అయితే, ప్రభుత్వం పరంగా ఆంక్షలు.. అనేది అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఏ ప్రభుత్వమూ ఓ మతాన్ని లేదా ఓ వర్గాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించదు. కాకపోతే, స్థానికంగా వున్న పరిస్థితుల కారణంగా ఆయా వివాదాలకు రాజకీయ రంగు అంటుకుంటుంది.

ప్రభుత్వంలో వున్నవారు ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలి. కానీ, ఇక్కడే సమస్య వచ్చి పడుతోంది. ‘అధికార పార్టీ నేతలు కదా.. అత్యుత్సాం చూపినా, చూసీ చూడనట్లు వదిలెయ్యాలి..’ అని కొందరు పోలీసులు లైట్ తీసుకోవడం వల్లే ఈ దుస్థితి.