లాక్ డౌన్ కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో సిలబస్సులు పూర్తి కాలేదు. విద్యార్ధులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకూ ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించాలని ఏపీ రాష్ర్టం సహా చాలా రాష్ర్టాలు ఇదే నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మాత్రం యధా విధిగా లాక్ డౌన్ తర్వాత నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్ లైన్ లో క్లాస్ లు నిర్వహించి ఏదోలా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సన్నాహాకాలు చేస్తోంది. జూన్ లో సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు పెట్టాలని నిర్ణయించింది.
ఇంకా కొన్ని రాష్ర్టాలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే చత్తీస్ ఘడ్ ప్రభుత్వం మాత్రం పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ర్టంలో పదోతరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే విద్యార్ధులకు ఇక్కడో మెలిక వేసింది. ఇదివరకూ రాసిన ఇంటర్నల్ పరీక్షల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని పాస్…ఫెయిల్? అన్నది నిర్ణయించాలని యోచన చేస్తున్నారుట.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగూ ఎగ్జామ్స్ పెట్టలేమని భావించే ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కుడా దగ్గరోనే ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు వినిపిస్తోంది. ఆ రాష్ర్టంలో మావోయిస్టుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితులు కూడా వేరు. కాబట్టి పదో తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా వెళ్లే అధికారులకు, పోలీస్ సిబ్బందికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని భావించే ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.