డిజిటల్ దోపిడీ.! మోడీగారూ.. దోచేస్తున్నారూ.!

Modi

డిజిటల్ మనీ, డిజిటల్ ట్రాన్సాక్షన్లు.. డిజిటల్ ఇండియా.. అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో చెప్పారు. అది నిజమయ్యింది కూడా. తప్పదు మరి, చాలా లావాదేవీలకు డిజిటల్ తప్పనిసరి అయిపోయింది. తప్పనిసరి అంటే, నేరుగా కాదు.. వక్ర మార్గంలో. దాంతో, ఇష్టం లేకపోయినా చాలామంది డిజిటల్ ట్రాన్సాక్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఏదైనా సరే, పెరుగుడు విరుగుడు కొరకే సుమీ.! అన్నట్టు, డిజిటల్ లావాదేవీలు పెరగడంతో, బాదుడు షురూ అయ్యింది. బ్యాంకులు ఎలా బాదేస్తున్నాయో లావాదేవీల విషయంలో చూస్తున్నాం. డబ్బులు తీస్తే బాదుడు, డబ్బులు వేస్తే బాదుడు.. బ్యాంకులు సామాన్యుల్ని పీల్చి పిప్పి చేసేస్తున్నాయి.. కరెన్సీ విషయంలో. డిపాజిట్లు, నగదు ఉప సంహరణల విషయమై బ్యాంకుల దెబ్బకి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడిక డిజిటల్ పేమెంట్ గేట్ వేలుగా చెప్పబడుతున్న పేటీఎం, ఫోన్ పే వంటివి కూడా వినియోగదారుల నుంచి ఛార్జీలను ముక్కు పిండి వసూలు చేసేస్తున్నాయి. దాంతో, వినియోగదారుల చేతి చమురు వదిలిపోతోంది. డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడిపోయాక, వెనక్కి రావడం కష్టం. ఈ క్రమంలో ఆయా సంస్థల దోపిడీపై ఏమీ చేయలేని పరిస్థితి.

డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రధాని మోడీ చెప్పినదానికీ, ఇప్పుడు జరుగుతున్నదానికీ అస్సలు పొంతన లేదు. ఆ మాటకొస్తే, పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి మోడీ చెప్పిందేదీ నిజం కాలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత, అసలు నకిలీ కరెన్సీకి అవకాశమే లేదన్నారు. కానీ, నకిలీ కరెన్సీనే కాదు, ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్లు పంచే ప్రక్రియ కూడా మరింత విజయవంతంగా నడుస్తోంది.

ఇప్పుడీ డిజిటల్ దోపిడీ దెబ్బకి.. సామాన్యుడి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది.