బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనమైందో తెలిసిందే. సుషాంత్ మరణంపై ఇప్పటికే పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడంతో కేసు మరింత జఠిలమైంది. ప్రస్తుతం సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు సుషాంత్ నివాసంలో మరిన్ని వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. తాజాగా సుషాంత్ మరణంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరో సంచలన ఆరోపణ చేసారు. సుషాంత్ పై విష ప్రయోగం జరిగిందని.. ఆ వాస్తవాలు బయటకు రాకుండా కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు.
అందువల్లే పోస్ట్ మార్టం ఆలస్యం చేసినట్లు అనుమానం వ్యక్తం చేసారు. బాధ్యులైన వారందర్నీ కఠినంగా శిక్షించాలని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ ట్వీట్ పై సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారు? కేసు నమోదు చేసిన అధికారులు ఎలా బధులిస్తారు? అన్నది చూడాలి. ఇక సుషాంత్ మరణం వెనుక పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నట్లు ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కొన్ని పెద్ద తలకాయల్ని పోలీసులు విచారించారు . బాలీవుడ్ నుంచి దాదాపు 40 మందిని విచారించారు. వాళ్ల నుంచి కొంత సమాచారం రాబట్టారు.
నెపోటిజం కారణంగా సుషాంత్ ఆత్మ హత్య చేసుకున్నాడు ? అన్న కోణంలోనే ఈ విచారణంతా సాగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఓ `రా` అధికారి సుషాంత్ ది ఆత్మహత్య కాదు..హత్య అని గట్టిగా అనుమానం వ్యక్తం చేసారు. దీని వెనుక ముంబై మాఫియా వ్యక్తులు ఉన్నారని అనుమానిస్తూ ఓ ట్వీట్ చేసారు. అయితే ఈ ట్వీట్ ని అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. మరి తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజా ఆరోపణకి…ఈ `రా` అధికారి అనుమానానికి ఏదైనా సంబంధం ఉందేమో! అన్న కొత్త కోణం తెరపైకి వస్తుంది.