Nara Lokesh: 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 7 నెలలు అవుతున్న ఇప్పటికీ గత ప్రభుత్వంలో జరిగిన స్కాముల గురించి ఏమాత్రం విచారణ జరపలేదని వారిపై చర్యలు తీసుకోలేదంటూ కొంతమంది కూటమి పార్టీ నేతలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇలాంటి వారికి మంత్రి నారా లోకేష్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. ఇటీవల నారా కుటుంబ సభ్యులందరూ కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నారావారిపల్లెకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి వేడుకలలో భాగంగా నారా లోకేష్ చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన కొంతమంది పార్టీ నేతలతో మాట్లాడారు. ఈ సమావేశంలో భాగంగా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పక్కన పెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకోపోతుందని ఈయన వెల్లడించారు.
అతి త్వరలోనే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే లిక్కర్ స్కాం, ఇసుక మాఫియాలో భాగమైన వారందరూ కూడా జైలుకు వెళ్తారని తెలిపారు. ఏపీలో గత ప్రభుత్వ హాయాంలో లిక్కర్, ఇసుక వ్యవహారం భారీ అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ప్రభుత్వం మారగానే ఈ అంశాల్లో విచారణకు సీఐడీని అదేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను జారీ చేశారు.
ఇలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి కేసులో నమోదు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ స్కాములలో భాగమైనటువంటి వారిని అరెస్టు చేయలేదని పార్టీ నేతలు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే అతి త్వరలోనే లిక్కర్, ఇసుక మాఫియాలో భాగమైనటువంటి వారందరూ కూడా జైలుకు వెళ్తారని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. మరో వైపు పార్టీ క్యాడర్ కు నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తామని నారా లోకేష్ తెలిపారు.