జగన్ బుర్రే బుర్ర.. అచ్చెన్న మీదకు మరొక మిస్సైల్ రెడీ అయింది

Jagan

వైఎస్ జగన్ వయసులో చిన్నవారే కానీ రాజకీయంలో ఆరితేరి పోయారు. ప్రత్యర్థులను అన్ని విధాలా ముట్టడించడంలో ఆ చతురత చూస్తుంటే మెచ్చుకోక తప్పదు. పార్టీ నిండుగా నేతలు, ప్రతి జిల్లాలోనూ సీనియర్ నాయకులను కలిగి ఉండటం ఆయనకు బాగా కలిసొస్తోంది. జగన్ గట్టిగా టార్గెట్ చేసిన జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా కూడ ఒకటి. టీడీపీ కంచుకోటలో ఒకటైన శ్రీకాకుళంలో గత ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పాగా వేయలేకపోయింది వైసీపీ,. అందుకు ఏకైక కారణం కింజారపు కుటుంబం. ఈ కుటుంబం నుండి అచ్చెన్నాయుడు ఎమ్మెలేగా, రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలవడంతో టీడీపీ ఇంకా బలంగానే ఉండగలుగుతోంది. వీరిద్దరినీ గనుక ఢీకొట్టగలిగితే జిల్లాలో వైసీపీకి తిరుగుండదు. కానీ అది అంత ఈజీ వ్యవహారం ఏమీ కాదు.

Jagan
Jagan and Acham Naidu

శ్రీకాకుళంలో ఎప్పుడూ సేఫ్ రాజకీయాలే నడుస్తుంటాయి. కింజారపు కుటుంబంతో సరిసమానమైన పలుకుబడి కలిగిన కుటుంబం ధర్మాన కుటుంబం. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఇద్దరూ వైసీపీలోనే ఉన్నారు. ఇద్దరికీ జిల్లాలో మంచి పట్టుంది. వీరిలో కృష్ణదాస్ ఉపముఖ్యమంత్రి పదవి పొంది వైసీపీకి వీరవిధేయుడిగా ఉండగా ప్రసాదరావు మాత్రం జగన్ మీద కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ నాయకుడినైన తనకు మంత్రి పదవి ఇవ్వలేదనేది ఆయన కోపం. అయితే ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం వెనుక రీజన్ ఉంది. గతంలో ఆయన వైసీపీలో ఉంటూనే జగన్ మీద గిల్లికజ్జాలు ఆడారు. ఆ ఎఫెక్ట్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కకుండా చేసింది. అందుకే ఆయన జిల్లా మొత్తం పలుకుబడి ఉన్నా తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు.

జగన్ సైతం ప్రసాదరావు అలకను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడును టీడీపీ అధ్యక్షుడిని చేశారో అప్పటి నుంచి వైసీపీకి ప్రసాదరావు అవసరం పడింది. కేవలం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గట్టిగా పోరాడిన అచ్చెన్నాయుడు కొత్త పదవి రావడంతో మరింత స్పీడ్ పెంచారు. ఆయనకు కళ్లెం వేసి జిల్లాలో పట్టు నిలుపుకోవాలంటే ప్రసాదరావు ఒక్కరే వైసీపీకి మార్గం. అందుకే ఆయన్ను కదిపారు జగన్. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉందనే సంకేతాలిచ్చి యాక్టివ్ అవ్వమన్నారు. ఈ సిగ్నల్స్ అందుకున్న ప్రసాదరావు నియోజకవర్గం దాటి బయట అడుగుపెట్టారు. పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను కలుస్తున్నారు. శ్రేణులు సైతం ప్రసాదరావు యాక్టివ్ అవడంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఒకవేళ ప్రసాదరావుకు గనుక మంత్రివర్గంలో చోటు లభిస్తే జిల్లాలో వారిని ఆపడం అచ్చెన్నాయుడుకు అసాధ్యమనే అనాలి.