ఎట్టకేలకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ బెయిల్ మీద విడుదలయ్యారు. ఇటీవల కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలంటూ యాగీ చేసి, ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలపై తన అనుచరులు, కార్యకర్తలతో దాడి చేశారన్నది దేవినేని ఉమపై మోపబడ్డ అభియోగాల సారాంశం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి దేవినేని ఉమ మీద. ఆ కేసుల్లో వాస్తవం ఎంత.? అన్నది వేరే చర్చ. ఆయనకు బెయిల్ లభించింది. ఈ రోజు బెయిల్ మీద విడుదలయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జెయిలు నుంచి ఉమ విడుదలవుతున్న దరిమిలా, ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. టీడీపీ నేతలెవర్నీ తన వద్దకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ ఉమ మళ్ళీ తనదైన స్టయిల్లో పొలిటికల్ డ్రామా పండించారు. కరోనా నేపథ్యంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన మాజీ మంత్రి, ఇలా పోలీసులపైనా బురద చల్లడం ఆశ్చర్యకరమే.
మరోపక్క, దేవినేని ఉమని కలవనీయకుండా తమను హౌస్ అరెస్ట్ చేశారంటూ కొందరు టీడీపీ నేతలూ ఆరోపిస్తున్నారు. ఇదిగో, ఇలాంటి హంగామా చేయడం ద్వారానే లేనిపోని కేసులు కొనితెచ్చుకుంటున్నారు టీడీపీ నేతలు. కేసులు నమోదయ్యాక.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ తిరిగి ఎదురుదాడి చేయడం టీడీపీకి అలవాటైపోయింది. కాగా, చంద్రబాబు నేతృత్వంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై పోరాడతామని దేవినేని ఉమ చెబుతున్నారు. అంటే, కొండపల్లి అటవీ భూముల్లో అక్రమ మైనింగ్.. అంటూ మరోమారు దేవినేని ఉమ యాగీ చేయబోతున్నారన్నమాట. అదే జరిగితే, మళ్ళీ ఆయనపై సరికొత్తగా కేసులు నమోదయ్యే అవకాశమూ లేకపోలేదు. టీడీపీ హయాంలో దేవినేని ఉమ, స్థానికంగా తన అనుచరులతో కలిసి విలువైన భూముల్ని కొల్లగొట్టేశారనీ, ఇసుక అలాగే మట్టి కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అన్నిటికీ మించి, నీటి పారుదల శాఖ మంత్రిగా వున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి పెద్దమొత్తంలో నిధులు కొల్లగొట్టారనే ఆరోపణలూ ఆయన మీద వైసీపీ చేయడం చూశాం.