సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా వుందంటే..

రోజులు గడుస్తున్నాయ్.. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు.. ఆయనకు సర్జరీ కూడా జరిగింది. రోడ్డు ప్రమాదం తర్వాత కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అవి మినహాయిస్తే, ఆ తర్వాత ఎలాంటి వీడియోలు, ఫొటోలూ ఆసుపత్రి నుంచి బయటకు రాకపోవడం కొంతవరకు మంచిదే. అయితే, అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, ఆయనకు వైద్య చికిత్స అందిస్తోన్న అపోలో ఆసుపత్రి నుంచి దాదాపుగా ప్రతి రోజూ హెల్త్ బులెటిన్ విడుదలవుతోంది. కాలర్ బోన్ సర్జరీ అనంతరం, సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నది ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన తాజా హెల్త్ బులెటిన్ సారాంశం. మరోపక్క, ఆయన ఇంకా వెంటిలేటర్ సపోర్ట్‌తోనే వున్నారన్న వార్త అభిమానుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

క్రమంగా ఆ వెంటిలేటర్ నుంచి సాధారణ స్థితికి వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తీసుకుంటున్నట్లు వైద్యులు పేర్కొనడం ఒకింత ఊరట. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకుని వుండడంతో తల భాగానికి గాయాలు కాలేదు. అయితే, ఎక్కువ దూరం రోడ్డుపై స్కిడ్ అవడంతో పైపైన గాయాలు ఎక్కువగానే అయ్యాయి. ఇదిలా వుంటే, సాయి ధరమ్ తేజ్‌ని ఆసుపత్రిలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని వాకబు చేశారు. సాయి ధరమ్ తేజ్‌కి ప్రాణాపాయం లేదనీ, త్వరగా కోలుకుంటాడనీ వారంతా చెబుతున్నారు. సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టే అవకాశం వుందనే ప్రచారం జరుగుతోంది.