అధికార వైసీపీలో అంతర్గత పోరు అంతకంతకు పెరుగుతున్నట్టే ఉంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో, జిల్లాల్లో కీలకమైన నేతలకు పొసగడంలేదు. కారణం ఆధిపత్య పోరు. టీడీపీ నుండి పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలను, పాత నేతలకు నడుమ ఈ సమస్య రావడం మామూలే అనుకున్నా పార్టీలో మొదటి నుండి ఉన్న లీడర్ల నడుమ కూడ ఇదే సమస్య తలెత్తుతోందట. ఎమ్మెల్యే విడదల రజనీ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. నెల్లూరు జిల్లాలో పెద్ద రెడ్లకు మంత్రికి అస్సలు పొసగడంలేదు. ఇంకా కొన్నిచోట్ల సొంత పార్టీ నేతలకే పొసగని పరిస్థితి. తాజాగా ఇలాంటి వివాదమే ఒకటి తెరమీదికి వచ్చింది.
అది కూడ ముఖ్యమైన నేతలకే కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విజయనగరం జిల్లా నుండి వైసీపీకి ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారే బొత్స సత్యనారాయణ. పుష్ప శ్రీవాణి. బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని అత్యంత సన్నిహితుడు. కీలకమైన నిర్ణయాల్లో ఆయన సలహా తప్పకుండా తీసుకుంటారు జగన్. ఇక పుష్ప శ్రీవాణి అయితే వరుసగా రెండుసార్లు కురుపాం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా, గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్నారు. దీంతో ఇద్దరి నడుమ విజయనగరం జిల్లా మీద పట్టు కోసం కోల్డ్ వార్ నడుస్తోందట.
బొత్స సత్యనారాయణకు రాష్ట్ర స్థాయిలో పరిచయాలు ఎక్కువ. పుష్ప శ్రీవాణి కంటే ఆయనకే అనుభవం, పలుకుబడి ఉన్నాయి. అందుకే జిల్లాలో ఆయన మాటే ప్రముఖంగా చెలామణీ అవుతొంది. అధికారులు సైతం ఆయనకే ఫెవర్ గా నడుచుకుంటున్నారట. ఇదే డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి నచ్చట్లేదట. ఉపముఖ్యమంత్రిగా మంత్రి కంటే తనకే ఎక్కువ అధికారాలు ఉంటాయని, అయినా తన మాట చెల్లుబాటు కావట్లేదని, మొత్తం బొత్సగారి కంట్రోల్లోనే ఉందని నొచ్చుకున్నారట. అందుకే కొన్ని నెలలుగా మౌనం వహిస్తున్నారని, రాష్ట్రంలో పలు వివాదాలు నడుస్తున్నా పెద్దగా రియాక్ట్ కావట్లేదని చెప్పుకుంటున్నారు.